భారత్లో రెండో దశ కరోనా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులకు సంబంధించి వాస్తవ గణాంకాల వెల్లడిలో ప్రభుత్వాలు మరింత కృషిచేయాలన్నారు. ప్రస్తుత డేటా ఆధారంగా ఆగస్టు నాటికి కరోనా కారణంగా.. సుమారు 10లక్షల మంది చనిపోయే అవకాశముందని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) వెల్లడించిందని ఆమె అన్నారు. అయితే.. ఈ అంచనాలు వాస్తవం కావచ్చు, కాకపోవచ్చని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
"భారత్, ఇతర ఆగ్నేయ దేశాలలో రోజువారీగా నమోదవుతున్న కేసులు, మరణాలను చూస్తే తీవ్ర ఆందోళనగా ఉంది . ఈ సమయంలో అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవి వాస్తవ గణాంకాలను తక్కువ చేసి చూపుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలూ వాస్తవ లెక్కల్ని వెల్లడించడం లేదు. కరోనా కేసుల విషయంలో నిజమైన లెక్కల్ని వెల్లడించేందుకు అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలి."