కరోనా నియంత్రించడానికి ప్రపంచ దేశాల మధ్య ఓ సహకార అవగాహనా ఒప్పందం అవసరమని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. భవిష్యత్‌లో సరికొత్త వేరియంట్లు ఉద్భవించినప్పటికీ ధాటిగా ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాతో జరిగిన సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనోమ్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఓ అవగాహన ఒప్పందం అవసరమని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ లక్షణాలు అంత తీవ్రంగా లేవని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. గత 10 రోజుల్లోనే 81 శాతం కేసులు పెరిగాయని గాటెంగ్ ప్రావిన్సుకు చెందిన డా. ఉబెన్ పిల్లై తెలిపారు. ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. టీకా వేసుకోనివారి కంటే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో మరింత తక్కువ తీవ్రత కనిపిస్తోందని పేర్కొన్నారు.
వివిధ దేశాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్..
- పోర్చుగల్‌లో సోమవారం 13 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రముఖ సాకర్ క్లబ్ సభ్యుల్లో ఒకరిలో ఈ లక్షణాలు కనిపించాయని వైద్యాధికారులు తెలిపారు. దీనితో కొత్త వేరియంట్‌ను అర్థం చేసుకునేంతవరకు కఠినమైన నిబంధనలను పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. అయితే.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వ నియంత్రణ లేనప్పటికీ.. ప్రొఫెషనల్ సాకర్ క్లబ్‌లు స్వచ్ఛందంగా మ్యాచ్‌లను నిలిపే అంశంపై సమాలోచనలు జరుపుతున్నాయి.
- పోర్చుగల్‌లో కొత్తగా 2,897 కేసులు వెలుగుచూడగా.. 12 మంది మరణించారు. దీనితో మరణాల సంఖ్య 18,400కి చేరింది.
- స్కాట్లాండ్లోనూ ఆరు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీనితో మరింత కాంటాక్ట్ ట్రేసింగ్‌ను మరింత పక్కాగా చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.
- ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుల పంపిణీపై నేడు ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన స్వతంత్ర సలహా సంస్థ కొన్ని ప్రతిపాదనలు చేయనుంది. ముఖ్యంగా 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోసు పంపిణీ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉంది. అంతేగాక.. దాని కాల వ్యవధిని తగ్గించే అంశంపైనా చర్చించనుంది.
- ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు.. వారికి సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. వీరికి కొత్త వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్న అధికారులు ఫలితాల కోసం వేచి ఉన్నారు.
ఇదీ చూడండి:ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు!