తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫైజర్‌ టీకా వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతి - కరోనా వ్యాక్సిన్​

కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పేద దేశాల్లో వ్యాక్సినేషన్‌కు మార్గం సుగమమైంది. సరైన వసతులు లేని దేశాలకు మద్దతుగా నిలుస్తామని తెలిపింది డబ్ల్యూహెచ్​ఓ.

Pfizer vaccine
ఫైజర్‌ టీకా వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతి

By

Published : Jan 1, 2021, 10:42 AM IST

కొవిడ్‌ నిరోధానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం ఆమోదం తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా దిగుమతి, పంపిణీకి మార్గం సుగమమైంది. అలాగే పేద దేశాలు సైతం దీన్ని త్వరలోనే అందిపుచ్చుకునేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఐరోపా, ఉత్తర అమెరికాలో దేశాల్లో ఈ టీకాను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే, ఆయా దేశాల్లో ఉండే ప్రత్యేక నియంత్రణా సంస్థలు సైతం ఈ టీకాకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, ఆరోగ్య వ్యవస్థలు అంత బలంగా లేని పేద దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదమే కీలకంగా మారనుంది. తాము ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించడం ద్వారా ప్రపంచ దేశాలు తమ వ్యాక్సిన్‌ డోసుల కొనుగోలు, పంపిణీని వేగవంతం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. బ్రిటన్‌, అమెరికా సహా మరో డజనకు పైగా దేశాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ వ్యాక్సిన్‌ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తమ సమీక్షలో తేలిందని స్పష్టం చేసింది.

ఫైజర్‌ టీకాను అత్యంత శీతల వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వసతులు లేని పేద దేశాలకు ఈ టీకా అందిపుచ్చుకొని పంపిణీ చేయడం పెద్ద సవాల్‌గా నిలవనుంది. అయితే, అలాంటి దేశాలకు తమ సహకారం అందిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ హామీ ఇచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:'కొవిషీల్డ్‌' అత్యవసర వినియోగానికి నేడు అనుమతి!

ABOUT THE AUTHOR

...view details