WHO Pathogens Warning: గత శతాబ్దాల కాలంగా ప్రపంచ దేశాలపై ఎన్నో వైరస్‌లు బ్యాక్టీరియాలు, హానికారక క్రిములు దాడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రాణాంతక మహమ్మారులపై పరిశోధనలు చేసి వాటిని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనశాలలు కృషి చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై ప్రయోగాలు చేసే ఈ ల్యాబ్‌లలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను విషాదాన్ని నింపక తప్పదు. సరిగ్గా కరోనా విషయంలోనూ ఇదే జరిగిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. వుహాన్ ల్యాబ్‌లో జరిగిన తప్పిదం వల్లే వైరస్ పుట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ల్యాబ్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా చేస్తున్న ముప్పెట దాడితో ల్యాబ్‌లు దెబ్బతిని వ్యాధికారక ప్యాథోజెన్స్ గాలిలో కలిసే ప్రమాదముందని అభిప్రాయపడింది. ఈ ల్యాబ్‌లలోని హానికారక పాథోజెన్స్‌ను వెంటనే నాశనం చేయాలని ఉక్రెయిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది.
Russia Ukraine news
ఇతర దేశాల తరహాలోనే ఉక్రెయిన్‌లో పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. అక్కడ ప్రమాదకరమైన వ్యాధుల గురించి అధ్యయనం చేస్తున్నారు. మనుషులు, జంతువులకు సోకే రోగాలపై విస్తృతంగా పరిశోధనలు చేసి వాటిని నియంత్రించే ఔషధాలను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కొవిడ్-19 గురించి కూడా ఉక్రెయిన్ ల్యాబ్స్‌లో పరిశోధనలు జరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. కొన్ని ల్యాబ్‌లకు అమెరికా, ఈయూ, డబ్ల్యూహెచ్‌ఓ నుంచి కూడా నిధులు అందుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేస్తున్న ల్యాబ్స్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. అమెరికా ఆధీనంలో ఉన్న జీవ, రసాయనిక ఆయుధాల కేంద్రాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉక్రెయిన్‌ను హెచ్చరించింది.