కరోనా మహమ్మారి(Corona Virus) మరోమారు పంజా విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). గత వారంలో ఏకంగా 40 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాసియా, ఆసియా దేశాల్లో విజృంభణే ఇందుకు కారణంగా పేర్కొంది. గత నెల రోజుల నుంచి కరోనా వ్యాప్తి పెరుగుతోందని, అయితే.. ప్రపంచవ్యాప్తంగా మరణాలు 8 శాతం తగ్గటం ఊరట కలిగించే విషయమని తెలిపింది.
కరోనా కేసులు, మరణాలపై వార నివేదికను బుధవారం విడుదల చేసింది డబ్ల్యూహెచ్ఓ.
"పశ్చిమాసియా, ఆసియాలో మరణాల సంఖ్య మూడింతలు పెరిగింది. గత వారంలో అమెరికా, భారత్, ఇండోనేసియా, బ్రెజిల్, ఇరాన్ దేశాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 130కిపైగా దేశాల్లో డెల్టా వేరియంట్ (Delta Variant)కేసులు వెలుగు చూశాయి. మరోవైపు.. ఐరోపాలో కొత్త కేసులు 9 శాతం తగ్గాయి. దీంతో బ్రిటన్, స్పెయిన్‌పై వైరస్ ప్రభావం కాస్త తగ్గింది."
-ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో యూకేలో కొవిడ్-19 ఆంక్షలను పూర్తిస్థాయిలో తొలగించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సుమారు 60 శాతం మంది బ్రిటీష్ ప్రజలకు పూర్తిస్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్(Covid-19 vaccine) అందినట్లు పేర్కొంది.
బూస్టర్ డోస్‌పై మారటోరియం..
కొవిడ్ టీకా(Corona vaccine) అతి తక్కువ మందికి అందిన దేశాల్లో కనీసం ఒక్కడోసైనా అందుబాటులో ఉంచేందుకు బూస్టర్ డోస్‌పై(Booster dose) మారటోరియం విధించాలని కోరారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న ధనిక దేశాలు.. పేద దేశాలకు డోసులను అందించేందుకు ముందుకు రావాలని కోరారు. 'ప్రతి దేశంలో కనీసం 10 శాతం మందికైనా టీకా అందేందుకు.. వచ్చే సెప్టెంబర్ చివరి వరకైనా బూస్టర్ డోస్‌పై మారటోరియం విధించాలని డబ్ల్యూహెచ్ఓ కోరుతోంది' అని పేర్కొన్నారు.
మరోవైపు.. బూస్టర్ డోస్ కొవిడ్-19పై మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్న విషయాన్ని సైన్స్ నిరూపించలేదని గుర్తు చేశారు డబ్ల్యూహెచ్ఓ అధికారులు.
ఇదీ చూడండి:వైరస్‌లపై ఆయుధాలను పొదుపుగా వాడాల్సిందే!