భూతాపాన్ని పారిశ్రామిక విప్లవం కంటే ముందున్న 1.5 డిగ్రీల స్థాయికి పరిమితం చేయాలని పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాతావరణ మార్పులను కట్టడి చేసేలా ఈమేరకు అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సమావేశం(కాప్26)లో పర్యావరణం అంశంపైనే దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఈ వాతావరణ సదస్సులు నిర్వహిస్తున్నప్పుడల్లా మనకు వినిపించేది ఒకటే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల స్థాయికి పరమితం చేయడం అని. అంటే పుడమి సగటు ఉష్ణోగ్రతను నిర్దేశిత లక్ష్యాన్ని మించకుండా చూడటం. 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే.. పరిణామాలు (Global Warming Impact) అత్యంత తీవ్రంగా ఉంటాయి. అకాల వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, భీకర వరదలు, మంచు కరగి సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి అంశాలన్నీ భూతాపానికి (Global Warming Impact) ముడిపడి ఉన్నాయి.
పర్యావరణ మార్పుల ప్రభావం (Global Warming Impact) పెరుగుతున్న ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉండదు. దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భూతాపం సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2020లో ఉత్తరార్ధగోళంలో సగటుతో పోలిస్తే 1.28 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. 141 ఏళ్ల చరిత్రలో అదే అత్యధికం. ఈ ప్రభావం (Effects of Global Warming) పర్యావరణంపై ప్రత్యక్షంగా కనబడింది. 2020 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. తరచుగా వేడిగాలులు, తుపానులు సంభవించాయి. వేల ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. ఇసుక తుపానులు, కార్చిచ్చులు విధ్వంసం సృష్టించాయి. బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మరి 1.5 డిగ్రీలకే ఇలా ఉంటే.. భూతాపం 3 డిగ్రీలకు పెరిగితే ఎలా (Global Warming Projections) ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తల మెదళ్లలో పుట్టింది. దీనిపై విస్తృతంగా పరిశోధన చేయగా.. వెలుగులోకి వచ్చిన అంశాలు విస్తుపోయే విధంగా ఉన్నాయి.