తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం? - రోదసి వార్తలు

అంతరిక్షంలోకి వెళ్లినవారు చనిపోతే పరిస్థితి ఏంటి? భూమిపై మరణించాక మానవ దేహం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ రోదసిలో పూర్తిగా కుళ్లిపోదు. అక్కడి గురుత్వాకర్షణ, వాతావరణం, ఉష్ణోగ్రతలను బట్టి మృతదేహం భిన్న మార్పులకు లోనవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

what will happen to a deadbody in space
అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం?

By

Published : Oct 17, 2021, 7:54 AM IST

అంతరిక్షంలోకి విహారయాత్రలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. సెలవులను ఆస్వాదించడానికి లేదా స్థిరపడటానికి ఇతర గ్రహాలకు వెళ్లే రోజులు భవిష్యత్‌లో రాబోతున్నాయి. అంటే.. అంతరిక్షంలో జీవించడం ఎలా అన్నదానిపై మనం ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయితే అక్కడ చనిపోతే పరిస్థితి ఏంటి? భూమిపై మరణించాక మానవ దేహం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ రోదసిలో పూర్తిగా కుళ్లిపోదు. అక్కడి గురుత్వాకర్షణ, వాతావరణం, ఉష్ణోగ్రతలను బట్టి మృతదేహం భిన్న మార్పులకు లోనవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమిపై మరణానంతరం దేహంలో జరిగే ప్రక్రియ ఇది..

  • తొలుత రక్త ప్రవాహం నిలిచిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది ఒకచోట చేరడం మొదలవుతుంది. ఈ ప్రక్రియను లివోర్‌ మోర్టిస్‌ అంటారు. ఆ తర్వాత శరీరం చల్లబడటం (ఆల్గోర్‌ మోర్టిస్‌) ప్రారంభమవుతుంది. అనంతరం కండరాల్లో అపరిమితంగా కాల్షియం పేరుకుపోయి, అవి బిగుసుకుపోవడం (రిగోర్‌ మోర్టిస్‌) మొదలవుతుంది. ఎంజైమ్‌లు, ప్రొటీన్లు.. కణాల గోడలను విచ్ఛిన్నం చేస్తాయి.
  • ఇదే సమయంలో పేగుల్లోని బ్యాక్టీరియా.. శరీరమంతా వ్యాపిస్తాయి. మృదు కణజాలాన్ని తినేస్తాయి. వాటి నుంచి వెలువడే వాయువులతో శరీరం ఉబ్బిపోతుంది. ఇదే సమయంలో కండరాలు నాశనం కావడం వల్ల రిగోర్‌ మోర్టిస్‌ ఆగిపోతుంది. దుర్వాసన మొదలవుతుంది.
  • ఉష్ణోగ్రత, కీటకాల చర్యలు, శరీరాన్ని పూడ్చడం తదితర అంశాలూ శరీరం కుళ్లిపోయే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి.
  • వేడి లేదా శీతల పరిస్థితులతో కూడిన పొడి వాతావరణం ఉంటే శరీరం ఎండిపోవడం మొదలవుతుంది.
  • చాలా సందర్భాల్లో.. అంతిమంగా మృదు కణజాలం అంతర్థానమై, అస్థి పంజరం బయటకు కనిపిస్తుంది. వేల సంవత్సరాలు అది మనుగడ సాగించగలదు.

విశ్వంలో భిన్నంగా..

విశ్వంలో ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇతర గ్రహాల్లోని గురుత్వాకర్షణ శక్తిలో వైరుధ్యాలు లివోర్‌ మోర్టిస్‌ దశపై ప్రభావం చూపుతాయి. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి లేకుంటే దేహంలోని రక్తం పోగుపడదు.

  • మృతుడు స్పేస్‌ సూట్‌ ధరించి ఉన్నా.. రిగోర్‌ మోర్టిస్‌ ఏర్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా.. మృత కణజాలాన్ని తినేయడమూ జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పనిచేయడానికి ఆక్సిజన్‌ అవసరం. ఈ వాయువు పరిమితంగానే ఉంటే ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
  • భూమిలో ఖననం చేసిన దేహాన్ని కుళ్లబెట్టే ప్రక్రియలో నేలలోని సూక్ష్మజీవులూ సాయపడతాయి. ఇతర గ్రహాల్లో అలాంటివి లేవు.
  • జీవించి ఉన్నప్పుడు ఎముకలూ సజీవ పదార్థాలే. వాటిలో కర్బన, అకర్బన పదార్థాలు ఉంటాయి. సాధారణంగా కర్బన పదార్థాలు కుళ్లిపోతాయి. అకర్బన పదార్థాలు అస్థిపంజరాల్లా మిగిలిపోతాయి. ఇతర గ్రహాల్లో తీవ్ర ఆమ్లత్వంతో కూడిన పరిస్థితుల్లో ఇందుకు భిన్నంగా జరుగుతుంది. అకర్బన పదార్థాలు అంతర్థానమై, మృదు కణజాలం మిగిలిపోతుంది.
  • అంగారకుడిపై పొడి వాతావరణం.. శరీరంలోని మృదు కణజాలాన్ని ఎండిపోయేలా చేస్తుంది. గాలివాటున వచ్చే అవక్షేపాలు.. భూమి మీద తరహాలో అస్థిపంజరాన్ని క్షీణింపచేయవచ్చు.
  • చంద్రుడిపై ఉష్ణోగ్రతలు 120 డిగ్రీల నుంచి -170 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటాయి. అందువల్ల వేడి లేదా శీతల ప్రక్రియలతో కలిగే నష్టం మృతదేహాలపై పడుతుంది.
  • మొత్తంమీద విశ్వంలో.. మృతదేహం క్షీణత పూర్తిస్థాయిలో జరగదు. అందువల్ల కొత్త రకం అంత్యక్రియలు అవసరం. అయితే ఖననం కోసం ప్రతికూల వాతావరణంలో నేలను తవ్వాల్సి రావడం గానీ విద్యుత్‌ను ఎక్కువగా వాడే దహన ప్రక్రియ గానీ అందులో ఉండకూడదు.

ఇదీ చదవండి:Lucy Mission Nasa: నింగిలోకి 'లూసీ'.. 12 ఏళ్లు, 630 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details