WHO on NeoCoV: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్ వైరస్ ఉన్నట్టు తేలిన పరిశోధనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో 'నియో కోవ్' ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే.. ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.
మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు మూలం జంతువులేనని, మరీ ముఖ్యంగా అటవీ జంతువులని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. జంతువులతో పాటు వైరస్‌లకు సహజ రిజర్వాయర్‌గా గుర్తించిన గబ్బిలాల్లోనూ కరోనా వైరస్‌లు ఉంటాయంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే జునోటిక్ వైరస్‌లను ఎదుర్కోవడంలో తాము అత్యంత చురుగ్గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలను పంచుకున్న చైనా పరిశోధకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.