ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమవుతుంటే.. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కలవరపెడుతోంది. అవే రష్యా-ఉక్రెయిన్! గత రెండు రోజుల్లో రష్యా సుమారు లక్షన్నరమంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. కేవలం ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా.. అగ్రరాజ్యమైన అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలు సైతం పరోక్షంగా ఇందులో భాగమయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా ఇప్పుడిదో కీలకాంశంగా మారింది. జర్మనీ ఛాన్స్‌లర్ మెర్కెల్ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలని కోరారు. ఇంతకూ రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య గొడవేంటంటే..
బంధాలు దిగజారి..
ఈ రెండు దేశాల మధ్య సంబంధాలెన్నడూ సవ్యంగా లేవు. కొద్దిరోజులుగా ఇవి మరింత దిగజారి, ఉద్రిక్తతలు పెరిగాయి. 'యుద్ధానికి ఒక అడుగు దూరంలో ఉన్నామంతే' అంటూ ఇటీవల రష్యా టీవీలో వచ్చిన ప్రకటనతో అంతా ఉలిక్కిపడ్డారు! ఆ వార్తల్లో.. ఉక్రెయిన్‌ను ఏకంగా నాజీ రాజ్యంతో పోల్చారు. నాడు జర్మనీలో చేసినట్లే ఇప్పుడు ఉక్రెయిన్‌ను కూడా నాజీల నుంచి విముక్తం చేయాల్సిన పరిస్థితి రష్యాకు వస్తోందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండి.. రష్యా అధికారం కింద ఉండేది. సోవియట్ యూనియన్ 1991లో విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైంది. కానీ రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సంబంధాలు మొదట్నుంచీ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చాయి. 2014లో ఉక్రెయిన్ ప్రాంతమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ మధ్యకాలంలో సరిహద్దుల్లోని ఉక్రెయిన్ డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా సైనిక కార్యకలాపాల వల్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి 26న నలుగురు ఉక్రెయిన్ సైనికుల్ని చంపేశారు. దీంతో గతేడాది కుదుర్చుకున్న కాల్పుల నియంత్రణను ఉల్లంఘించినట్లైంది. తన సార్వభౌమత్వాన్ని రష్యా సవాలు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. "సరిహద్దుల్లో భారీగా బలగాలను దింపారు. యుద్ధమనేది ఇప్పుడు పుతిన్ చేతుల్లో ఉంది" అని ఉక్రెయిన్ జాతీయ రక్షణ, భద్రత మండలి కార్యదర్శి వ్యాఖ్యానించారు. దీన్ని రష్యా విదేశాంగ ప్రతినిధి కొట్టిపారేస్తూ.. "రష్యా దాడి గురించి ఉక్రెయిన్ మీడియా భ్రమల్లో ఉంది" అని పేర్కొన్నారు.