వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) దావోస్ శిఖరాగ్ర సదస్సు ఆదివారం ప్రారంభం కానుంది. ఆరు రోజుల పాటు ఆన్లైన్ మాధ్యమం ద్వారా సాగే ఈ సమావేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానున్నారు. 'దావోస్ అజెండా' పేరుతో ఈ సమావేశాలు జరగనున్నాయి.
నేటి నుంచి 'దావోస్' శిఖరాగ్ర సదస్సు - ప్రపంచ ఆర్థిక వేదిక
ఆరు రోజుల పాటు సాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం శిఖరాగ్ర సదస్సు ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ గురువారం ప్రసంగించనున్నారు. వివిధ దేశాలకు చెందిన మొత్తం వెయ్యి మంది ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు సమావేశానికి హాజరుకానున్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులతో పాటు, తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ సదస్సులో పాల్గొననున్నారు.
సదస్సులో మొత్తం 15 ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. ప్రధాని మోదీ గురువారం ప్రసంగిస్తారని వెల్లడించింది. భారీ స్థాయిలో జరగనున్న సదస్సులో మొత్తం వెయ్యి మంది వివిధ దేశాల నేతలు, కంపెనీల సీఈఓలు, ఛైర్మన్లు, ప్రపంచస్థాయి సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సంబంధిత విషయాలతో పాటు కరోనా తర్వాత ఎదురయ్యే సామాజిక, సాంకేతిక సవాళ్లపై వీరంతా చర్చించనున్నారు.
భారత్ నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు సైతం శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. వ్యాపారవేత్తల్లో.. ఆనంద్ మహీంద్ర, సలీల్ పరేఖ్, శోభనా కామినేని దావోస్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈయూ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షురాలు క్రిస్టినా లగార్డే, ప్రముఖ వ్యాపార వేత్త బిల్‌గేట్స్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్, యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.