ప్రొఫెషనలిజానికి పర్యాయపదంగా.. కార్పొరేట్ కార్యాలయ వస్త్రధారణలో తప్పనిసరిగా ఉండే 'టై'(wearing a tie) వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు జర్మనీలోని కీల్ యూనివర్సిటీ(kiel university) శాస్త్రవేత్తలు. టై ధరించడాన్ని ఆధునిక సమాజంలో అధికారికంగా గొంతు కోసుకోవడమేనని అభివర్ణించారు. శరీరంలో రక్త ప్రవాహాన్ని 'టై' ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశోధించి 'న్యూ సైంటిస్ట్' అనే మేగజైన్లో(new scientist magazine) తమ అధ్యయన నివేదికను ప్రచురించారు.
టై ధరించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..
- మెదడుకు రక్తప్రసరణ(blood circulation) 7.5% తగ్గుతుంది.
- కంటిలోపల తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది.
- గ్లకోమా అనే వ్యాధితో పాటు, కంటిలో శుక్లాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
అధ్యయనం సాగిందిలా..
కీల్ యూనివర్సిటీ హాస్పిటల్(kiel university hospital) శాస్త్రవేత్తలు టైలు ధరించిన 15 మంది పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఎంఆర్ఐ స్కానింగ్‌తో(mri scanning) తలలో రక్తసరఫరా తీరును అంచనా వేశారు. టై ఒత్తిడి వల్ల వీరిలో గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల్లో రక్తప్రవాహ వేగం 7.5% తగ్గుతోందని కనుగొన్నారు. దీనివల్ల తక్షణ అనారోగ్యం కలగకపోయినా.. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రధానంగా వయసు పైబడిన వారు, అధిక రక్తపోటుతో(high blood pressure) బాధపడుతున్న వారు, ధూమపానం అలవాటున్న వారు ఎక్కువ సమయం టై ధరించినట్లయితే తలనొప్పి, వికారం వంటి లక్షణాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.
'ది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ'(british journal of ophthalmology) అధ్యయనం కూడా అదేపనిగా 'టై' ధరిస్తే వచ్చే దుష్పరిమాణాలపై దాదాపు ఇదే తరహా నివేదికను వెలువరించింది.