కరోనా మహమ్మారి మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్. కొవిడ్ మూలాలపై జరుగుతున్న దర్యాప్తును రాజకీయం చేయొద్దని ప్రపంచ నేతలను కోరారు. అది కరోనా వెనకున్న నిజానిజాలు తెల్చేందుకు ఉపయోగపడదని సూచించారు.
ఈ మేరకు మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు టెడ్రోస్. కరోనా మూలాలపై అధ్యయనాన్ని వుహాన్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు అవసరమైతే ఇతర కేంద్రాలకు విస్తరిస్తామని తెలిపారు.
" కొవిడ్ మూలాల్ని తెలుసుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారు. వుహాన్ నుంచి ఈ అధ్యయనం ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతోందని తెలుసుకోవటం సహా లభించిన ఆధారాలను అనుసరించి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం. కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ వైఖరి చాలా స్పష్టంగా ఉందని మీకు భరోసా ఇస్తున్నా. వైరస్ మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను నివారించేందుకు సాయపడుతుంది. "