చైనాలో పుట్టిన కరోనా వైరస్... ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలను హరిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించడం, వైరస్ నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచడం కీలకమని అంటున్నారు విశ్లేషకులు. అప్పుడే వైరస్ సోకినవారిని తొందరగా వేరు చేయగలమని చెబుతున్నారు.
పలు ఔషధ కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై నిమగ్నం కాగా మరికొన్ని సంస్థలు నిమిషాల్లో కరోనా వైరస్ ను నిర్ధరించే టెస్ట్ కిట్లను తయారు చేస్తున్నాయి. ఇలా నిమిషాల్లో ఫలితాలు వెలువరించే కిట్లపై ప్రపంచ రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం వాటి విశ్వసనీయత, కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
35 లక్షల కిట్లకు ఆర్డర్..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కరోనా వైరస్ రాపిడ్ టెస్ట్ కిట్ల ఆవిష్కరణను కొనియాడారు. వీటిని కరోనా సంక్షోభ సమయంలో 'గేమ్ ఛేంజర్'గా అభివర్ణించారు. ఈ వారంలో 35 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లకు ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు.
వైరస్ సోకిందా లేదా అన్న విషయాన్ని వీటితో త్వరగా నిర్ధరించవచ్చని బ్రిటన్ చెబుతోంది. ఫలితంగా వైరస్ లేని వారికి క్వారంటైన్ నుంచి విముక్తి కల్పించి పనులకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వచ్చని చూస్తోంది. తద్వారా... స్తంభించిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలుగుతుందని భావిస్తోంది బ్రిటన్.
కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ పరీక్షల సరైన ఫలితాలు ఇస్తాయని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. వాటి కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. లేదా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
పరీక్షలు ఇలా..
వైరస్ పరీక్షలు రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది యాంటిజెన్ టెస్ట్. అనుమానితుడి ముక్కు లేదా నోటిలోని స్రావాన్ని సేకరించి నిర్ధరించటం. రెండోది యాంటిబాడీ టెస్ట్.. రక్తాన్ని సేకరించి పరీక్షించటం.
కొన్ని నెలలుగా అనుమానితుడి నోటి స్రావాలతో వైద్యులు వైరస్ పరీక్షలు చేస్తున్నారు. ల్యాబ్లో శాస్త్రవేత్తలు ఈ స్రావాలలోని జన్యు పదార్థాన్ని వేరు చేసి కోట్లాది కణాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి వైరస్ను నిర్ధరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఒక్కోసారి కొన్ని రోజుల సమయం పడుతుంది.
నిపుణుల ఆందోళన..
రాపిడ్ యాంజిటెన్ పరీక్షల్లో తక్కువ స్రావాలను వినియోగిస్తారు. అదీ అనుమానితులే స్వయంగా ఇస్తారు. ఇవి ఫ్లూ టెస్ట్ తరహాలో 15 నిమిషాలలోపు ఫలితాన్ని ఇస్తాయి. ఈ పరీక్షల్లో యాంటిజెన్లపై దృష్టి పెడతారు. ఎందుకంటే వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో శరీరం యాంటిబాడీస్ (ప్రతినిరోధకాలు)ను ఉత్పత్తి చేస్తుంది.
చైనా, అమెరికా, మరికొన్ని దేశాలు టెస్ట్ ఫలితాలకు సంబంధించి కొన్ని వివరాలను విడుదల చేశాయి. వీటిని విశ్లేషించి ఓ అభిప్రాయానికి వచ్చారు నిపుణులు. సుదీర్ఘ విధానంలో జరిగే పరీక్షలతో పోలిస్తే రాపిడ్ టెస్టుల్లో ఫలితాలు అంతగా నమ్మదగినవి కాదని అంటున్నారు.