ఇతర ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా, కొవిడ్-19 కట్టడికి ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ రిచర్డ్ మిహిగో అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సంస్థకు చెందిన ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయంలో రోగనిరోధకత, వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమం ఏరియా మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆయన.. స్పుత్నిక్ వార్తా సంస్థతో మాట్లాడారు.
"వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జన్యువుల్లో మార్పుల కారణంగా ఫ్లూ వ్యాక్సిన్‌ను ఏటా పునరావృతం చేయాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం. కరోనా వైరస్ విషయంలో ఈ అవసరం ఉండకపోవచ్చని మేం విశ్వసిస్తున్నాం" అని రిచర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వివిధ దశల్లో ఉన్న వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే సమయం గురించి మాట్లాడుతూ.."వివిధ రకాల చికిత్సలు, వ్యాక్సిన్లను పరీక్షించే వాతావరణాన్ని సృష్టించడమే మా పని. క్లినికల్ ప్రయోగాల ఫలితాలను గమనిస్తాం. ఫలితం ఎప్పుడు అనేది మాత్రం ఊహించడం కష్టం" అని వెల్లడించారు.