అమెరికాలో కరోనాతో మరణించినవారి సంఖ్య 3 లక్షల 50 వేలు దాటింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు 2 కోట్లు దాటినట్లు జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం కారణంగా కేసులు ఒక్కసారిగా పెరిగినట్లు నిపుణులు తెలిపారు.
అమెరికాలో రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. వైద్య సిబ్బంది, 80ఏళ్ల పైబడిన వారికి ఈ టీకాలను అందిస్తున్నారు.
'లాక్డౌన్ పొడిగించాలి'
జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో జనవరి 10 వరకు విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని బవేరియన్ గవర్నర్ మార్కస్ సోడర్ అభిప్రాయపడ్డారు. పాఠశాలలు ఇప్పుడే తెరవాల్సిన అవసరం లేదన్నారు. పదేపదే లాక్‌డౌన్‌ను సడలించటం, విధించటం ద్వారా ఫలితం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు సరిహద్దు దేశమైన ఆస్ట్రియానే నిదర్శనమని తెలిపారు.
16 రాష్ట్రాల గవర్నర్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో మంగళవారం సమావేశమై లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
మరింత కఠినం
కొత్తరకం కరోనా వైరస్ బ్రిటన్ను కలవరపెడుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేస్తున్నట్లు చెప్పారు.