బ్రిటన్‌లో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స అందించే ఓ నర్సుకు తీరని కష్టం వచ్చిపడింది. సుమారు 48 గంటల పాటు నిర్విరామంగా వైద్య సేవలను అందించిన ఆమెకు తినడానికి తిండి దొరక్క తీవ్ర మనోవేదనకు గురైంది. యూకే జాతీయ ఆరోగ్య సర్వీస్‌లో పని చేస్తున్న డాన్ బిల్‌బ్రో అనే నర్సుకు ఈ దయనీయ దుస్థితి ఎదురైంది.
రెండు రోజుల పాటు కరోనా రోగులకు అత్యవసర చికిత్సా విభాగంలో సేవలందించి వచ్చిన ఆమె.. తనకు కావలసిన పండ్లు, కూరగాయలను కొనటానికి మార్కెట్‌కు వెళ్లింది. కానీ అక్కడ అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో తన బాధను తెలుపుతూ ఓ వీడియోను చిత్రీకరించింది బిల్‌బ్రో. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తీసిన ఆ వీడియోను యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
కరోనా చికిత్స అందించే నర్సుకు ఎంతకష్టమెచ్చే!
"ఇప్పుడే నేను సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చాను. మార్కెట్లో పండ్లు, కూరగాయలు లేవు. దీంతో నాకు చాలా బాధకలిగింది. నేను కరోనా రోగులకు చికిత్స అందించే అత్యవసర విభాగంలో నర్సుగా పని చేస్తున్నా. ఇప్పుడే 48 గంటల పాటు నిర్విరామంగా పని చేసి వచ్చాను. మరో 48 గంటల పాటు ఉండటానికి నాకు కొంత ఆహారం కావాలి. కానీ మార్కెట్లో పండ్లు, కూరగాయలు ఏవీ లేవు. నా ఆకలి ఎలా తీరాలో నాకు అర్థం కావటం లేదు. ప్రజలు నిత్యావసర వస్తువులను కొని తీసుకొని వెళ్తున్నారు. తక్షణమే కొనటం ఆపాలి. ఎందుకంటే నాలాంటి అవసరం ఉన్న వ్యక్తులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కొన్ని గంటలు కొనడం ఆపండి."
-డాన్ బిల్‌బ్రో, యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) నర్సు
ఇదీ చూడండి:కరోనా! అందరికీ శాపం.. అతడికి మాత్రం వరం