Universal Vaccine: సాధారణ జలుబు కలిగించే కొన్ని రకాల కరోనా వైరస్‌ల బారినపడిన వారికి ప్రస్తుతం కొవిడ్ కారక సార్స్-కోవ్-2 నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని వెల్లడైంది. గతంలో అధిక స్థాయిలో వెలువడిన టి కణాల వల్ల ఇలాంటివారు ప్రస్తుతం కొవిడ్-19 బారినపడే అవకాశం తక్కువని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ బృందానికి భారత సంతతి పరిశోధకుడు అజిత్ లాల్‌వాని నేతృత్వం వహించారు. కొవిడ్ నుంచి రక్షించడంలో టి కణాల పాత్రను నిర్ధరించే మొదటి ఆధారాన్ని ఈ పరిశోధన ద్వారా అందించామని ఆయన తెలిపారు. ఒమిక్రాన్ సహా ప్రస్తుత, భవిష్యత్ కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే రెండో తరం సార్వత్రిక టీకాల తయారీకి ఈ పరిశోధన దోహదపడుతుందని వివరించారు.
" వ్యాక్సినేషన్ కారణంగా ప్రజల్లో ఉత్పత్తవుతున్న యాంటీబాడీల వల్ల స్పైక్ ప్రొటీన్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. టీకాలను ఏమార్చే ఉత్పరివర్తనాల పుట్టుకకు అది దారితీస్తోంది. దీనికి భిన్నంగా కరోనాలోని అంతర్గత ప్రొటీన్లు చాలా తక్కువగా ఉత్పరివర్తన చెందుతాయి. టి కణాలు వీటినే లక్ష్యంగా చేసుకుంటాయి. వీటివల్ల కరోనాలోని అన్ని వేరియంట్ల నుంచీ మెరుగైన రక్షణ పొందొచ్చు"