UNGA emergency special session: అణ్వాయుధ దళాలు సన్నద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జారీ చేసిన ఆదేశాలు అత్యంత భయానకమైనవని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. అణు యుద్ధం చేయాలన్న ఆలోచనే ఆమోదయోగ్యం కాదని అన్నారు. అణ్వాయుధాల వాడకాన్ని సమర్థించే అంశమేదీ ఉండదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు సత్వరమే ఫలప్రదమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు ప్రసంగించారు.
UN chief on Russian nuclear forces
"ఇప్పుడు తుపాకులే మాట్లాడుతున్నాయి. హింస వల్ల పౌరలు, చిన్నారులు చనిపోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. జరిగిందేదో జరిగింది. సైనికులు తమ స్థావరాలకు వెళ్లిపోవాలి. నాయకులు శాంతిమార్గాన్ని అనుసరించాలి. చర్చల దారులు ఎప్పుడూ తెరిచే ఉంచాలి. ఉక్రెయిన్ స్వతంత్రత, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలి."
-ఆంటోనియో గుటెరస్, ఐరాస చీఫ్
ఉక్రెయిన్‌పై దాడి వల్ల తలెత్తుతున్న పరిణామాలపై గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాల లక్ష్యంగానే దాడి చేస్తున్నామని రష్యా చెప్పినప్పటికీ.. సాధారణ భవనాలు, నివాస ప్రాంతాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఐరోపాలో గడిచిన దశాబ్దాల్లో తలెత్తిన అత్యంత తీవ్రమైన మానవతా, శరణార్థుల సంక్షోభంగా ఇది మారనుందని అన్నారు.
'యుద్ధంలో విజేతలు ఉండరు'
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్.. కాల్పులను తక్షణమే ఆపేయాలని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలని సూచించారు. రష్యా సైనిక చర్య.. ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తోందన్నారు. హింస తక్షణమే ఆగిపోవాలని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక చర్య ఐరాస చార్టర్‌కు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. అంతర్జాతీయ సమస్యలను శాంతియుత మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని, బలప్రయోగంతో కాదని హితవు పలికారు. 'యుద్ధంలో విజేతలు అంటూ ఉండరు. లెక్కలేనన్ని జీవితాలు విచ్ఛిన్నమవుతాయి' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఫలిస్తున్న 'ఆర్థిక అస్త్రం'... రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలు