కరోనా మహమ్మారిని అరికట్టేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ ఒక వాస్తవిక వ్యూహం అనే ఆలోచనను వ్యతిరేకించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్. అటువంటి ప్రతిపాదనలు పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు. వైద్య నిపుణులు వ్యాక్సిన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు టెడ్రోస్.
" తట్టు వంటి అత్యంత ప్రమాదకర అంటువ్యాధులను అరికట్టేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ పొందడానికి జనాభాలో 95 శాతం మందికి రోగనిరోధక శక్తి ఉండాలి. హెర్డ్ ఇమ్యూనిటీని వైరస్ నుంచి ప్రజలను రక్షించటం ద్వారా సాధించవచ్చు. కానీ, వైరస్ వ్యాప్తికి గురిచేయటం ద్వారా కాదు. ప్రజారోగ్య చరిత్రలో ఎన్నడూ హెర్డ్ ఇమ్యూనిటీని ఓ మహమ్మారిని అరికట్టేందుకు ఒక వ్యూహంగా ఉపయోగించలేదు. కరోనా కట్టడికి రోగనిరోధక శక్తి ముఖ్యమని చాలా తక్కువ మందికి తెలుసు. "