రష్యా కరోనా వ్యాక్సిన్‌పై మరింత సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆ దేశంతో చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు ఐరోపాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయం వెల్లడించింది.
వ్యాక్సిన్ తయారీలో వివిధ దశలకు సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలుసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో వేగం అవసరమైనప్పటికీ భద్రతా ప్రమాణాలను విస్మరించకూడదని పేర్కొంది.
వ్యాక్సిన్ అభివృద్ధిని డబ్ల్యూహెచ్ఓ స్వాగతిస్తుందని, అయితే అన్ని టీకాలకు ఒకే రకమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని సంస్థ(ఐరోపా) డైరెక్టర్ హాన్స్ క్లూగ్ అన్నారు. ఎల్లో ఫీవర్, పోలియో వంటి వాటికి టీకాను అభివృద్ధి చేసిన ఘనత రష్యాకు ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు క్లూగ్.