UN Chief On Russia: ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యకు పాల్పడడాన్ని తప్పుబట్టారు. రష్యా తక్షణమే ఈ చర్యలను మానుకోవాలని కోరారు. రష్యా చర్యలు ఐరాస చార్టర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
" ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఆగడాలను మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు కొన్ని దశాబ్దాలుగా యూరోప్ చూడలేదు. రష్యా చర్యలు యూఎన్ చార్టర్‌కు వ్యతిరేకం. ఉక్రెయిన్‌లో చావు, భయం, తదితర చిత్రాలను చూస్తున్నాం. "
-- ఆంటోనియో గుటెరస్, ఐరాస సెక్రటరీ జనరల్
రష్యా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచం మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్. అది లక్షలమంది జీవితాలపై ప్రభావం చూపుతుందన్నారు. రష్యా తక్షణమే తన బలగాలను వెనక్కుతీసుకోవాలని కోరారు. యుద్ధంలో అమాయకప్రజలే బలవుతారని అన్నారు.
రష్యా దాడిలో 137 మంది మృతి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు పూర్తి సన్నద్ధంతో ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. మరో 90రోజులపాటు బలగాల మోహరింపు ఉంటుందన్నారు.
మరోవైపు రష్యా దాడిలో ఇప్పటివరకు 137 మంది పౌరులు, సైనికులు మృతి చెందారని పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వీరులను హీరోలుగా అభివర్ణించారు జెలెన్స్కీ. వందలాది మంది గాయపడ్డారని తెలిపారు.