కరోనా ఉద్ధృతి కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల వల్ల గాలి నాణ్యత(Air Quality) కొద్దికాలం పాటు మెరుగుపడిందని ఐరాస వాతావరణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా ఈ మెరుగుదల కనిపించలేదని వివరించింది.
కొన్ని ప్రాంతాల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి యాథావిధిగా సాగిందని, పలుచోట్ల అవి లాక్‌డౌన్‌కు(Corona Lockdown) ముందు కన్నా ఎక్కువగానే వెలువడ్డాయని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ సంస్థ (డబ్ల్యూఎంవో) శుక్రవారం ఓ బులిటెన్‌ను విడుదల చేసింది.
వాయు నాణ్యతకు సంబంధించిన కొవిడ్ ఒక అనూహ్య ప్రయోగంలా మారింది. దీనివల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా వాతావరణం మెరుగుపడింది. అయితే జనాభా, వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికతో కూడిన ఓ కార్యాచరణ అవసరం. దానికి మహమ్మారులను ప్రత్యామ్నాయంగా భావించకూడదు.