ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ కోసం పరిశోధకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది క్రిస్మస్ నాటికి బ్రిటన్లో వ్యాక్సిన్ రావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ అధినేత కేట్ బింగ్హమ్. అయితే వ్యాక్సిన్ అందరికీ కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారికే ముందుగా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. టీకా వచ్చినా పరిస్థితులు వెంటనే కుదుటపడవని ఆమె అన్నారు.
సింగిల్ సరిపోదు..
ఒక్కసారి వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందని తాను భావించట్లేదని కేట్ స్పష్టం చేశారు. కొన్నేళ్లకు ఒకసారి రీవ్యాక్సినేషన్ అవసరమవుతుందని అన్నారు. వైరస్ ఎక్కువగా మార్పులు చెందితే టీకా ప్రయత్నాలు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చినా సరఫరా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాధాన్యం ఆధారంగానే పంపిణీ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. యూకే ప్రభుత్వం, జాయింట్ కమిటీ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ (జేసీవీఐ) కలిసి పంపిణీ ప్రణాళిక సిద్ధం చేస్తారని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా వ్యాక్సిన్ల సాయంతో హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నారు. ఇందులో ఆరింటిని బ్రిటన్ అభివృద్ధి చేస్తోంది.
ఇదీ చూడండి: 'కరోనా చికిత్సకు ఆ 4 ఔషధాలు పనికిరావు'