తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఐసోలేషన్​'పై ఆ దేశ ప్రధాని యూటర్న్​.. ఎందుకంటే?

కరోనా వైరస్​ సోకిన వారితో కాంటాక్ట్​లో ఉన్నవారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే.. ఆ దేశ ప్రధాని మాత్రం ఐసోలేషన్​కు వెళ్లేందుకు నిరాకరించారు. కానీ, కొద్ది గంటల్లోనే యూటర్న్​ తీసుకున్నారు. ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్వారంటైన్​లోకి వెళ్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Boris jahnson
క్వారంటైన్​లోకి బోరిస్​ జాన్సన్​

By

Published : Jul 18, 2021, 4:04 PM IST

Updated : Jul 18, 2021, 5:02 PM IST

కరోనా మహమ్మారి కట్టడే లక్ష్యంగా... టెస్ట్​ అండ్​ ట్రేస్​(వైరస్​ సోకిన వారితో కలిసిన వారిని గుర్తించటం, పరీక్షలు నిర్వహించటం) అనే విధానాన్ని అమలు చేస్తోంది బ్రిటన్​ ప్రభుత్వం. అందులో భాగంగా వైరస్​ సోకిన వారితో కాంటాక్ట్​లో ఉన్న వారంతా 10 రోజుల పాటు ఐసోలేషన్​లోకి వెళ్లాలి. అయితే.. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్ ముందుగా..​ ఐసోలేషన్​కు వెళ్లేందుకు నిరాకరించారు. కానీ, కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఇదీ జరిగింది..

శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్​ జావిద్​తో సమావేశమయ్యారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. జావిద్​కు శనివారం నిర్వహించిన కొవిడ్​-19 పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. అయితే.. ఆయన ఇప్పటికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకోవటం గమనార్హం. ఈ క్రమంలో 'టెస్ట్​ అండ్​ ట్రేస్​ ఫోన్​ యాప్​' ద్వారా ప్రధానిని అలర్ట్​ చేసినట్లు 10 డౌనింగ్​ స్ట్రీట్​ కార్యాలయం తెలిపింది.

మొబైల్​ యాప్​ ద్వారా అలర్ట్​ చేసిన వ్యక్తులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. అయితే.. కచ్చితంగా అని ఏమీ లేదు. పాజిటివ్​ కేసులతో సంబంధం ఉన్నవారు సాధారణంగా 10 రోజుల పాటు ఐసోలేషన్​కు వెళ్లాలని సూచిస్తున్నారు. కానీ, బోరిస్​ జాన్సన్​ ఐసోలేషన్​కు వెళ్లకుండా.. ప్రత్యేక పని ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న ప్రత్యామ్నాయ విధానంలో మాదిరిగా రోజువారీ కరోనా పరీక్షలు చేసుకుంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇదే ఫార్ములా దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్​కు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఆయన కూడా జావిద్​తో సమావేశమయ్యారు. వారు ఇరువురు తప్పనిసరి కార్యకలాపాల్లోనే పాల్గొంటారని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రత్యేక వీఐపీ రూల్​ ఏంటి?

ప్రత్యేక వీఐపీ రూల్​తో ఐసోలేషన్​కు వెళ్లకపోవటంపై చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేత జొనాతన్​ అశ్వర్థ్​ తెలిపారు. 'ఈ ఉదయం లేవగానే ఓ ప్రత్యేక నిబంధన గురించి విన్నా. బోరిస్​ జాన్సన్​, రిషి సునక్​కు ప్రత్యేకమైన రూల్​. వారికి ఒక నిబంధన, మిగిలిన మనందరికీ ఒక నిబంధన అని వారు చెబుతున్నారు.' అని ఓ మీడియా ఛానల్​తో చెప్పారు.

2020 ఏప్రిల్​లో కరోనా వైరస్​ సోకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు బ్రిటన్​ ప్రధాని. ఐసీయూలో మూడు రోజుల పాటు చికిత్స పొందారు. సోమవారం.. దేశంలోని మిగతా ప్రదేశాల్లోనూ లాక్​డౌన్​ ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ విషయం బయటకు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

యూటర్న్..

ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రావటం వల్ల బోరిస్​ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. బోరిస్​తో పాటు ఆర్థిక మంత్రి సైతం 10 రోజుల పాటు ఐసోలేషన్​కు వెళ్తారని మూడు గంటల్లోపే మరో ప్రకటన చేసింది ప్రధాని కార్యాలయం. ప్రధాని తన అధికారిక నివాసం​లోనే ఐసోలేషన్​లో ఉంటారని తెలిపింది.

ఇదీ చూడండి:జులై 19 నుంచి కరోనా ఆంక్షలు ఖతం!

Last Updated : Jul 18, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details