Ukraine Russia War: ఉక్రెయిన్ నగరాలపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఓడరేవు నగరం మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరియుపోల్‌ను నలుదిశలా చుట్టుముట్టిన పుతిన్ బలగాలు కొత్త వ్యూహాలకు తెరలేపాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మానవతా కారిడార్లు ఏర్పాటు చేస్తామని, అందుకు ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు విడిచి, మరియుపోల్‌ను అప్పగించాలని డిమాండ్ చేశాయి. మరియపోల్‌ను స్వాధీనం చేసుకుని వ్యూహాత్మకంగా ఉక్రెయిన్‌ను దెబ్బకొట్టాలని పుతిన్ బలగాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ డిమాండ్‌ను జెలెన్‌స్కీ బలగాలు తోసిపుచ్చడం వల్ల రెచ్చిపోయిన పుతిన్ సేనలు.. మరియుపోల్‌లో ప్రతి 10 నిమిషాలకోసారి బాంబుల వర్షం కురిపించింది.
ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో 651 నివాస భవనాలు పూర్తిగా ధ్వంసం కాగా.. 3,780 భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. రష్యా దండయాత్రతో కొన్నిదేశాల్లో భయంకరమైన కరవు పరిస్థితులు తలెత్తుతాయని జెలెన్‌స్కీ హెచ్చరించారు. అతిపెద్ద ఆహార ధాన్యాల ఎగుమతుల దేశాల్లో ఉక్రెయిన్ ఒకటిగా ఉందన్న జెలెన్‌స్కీ.. రష్యా దాడులతో తాము ఎలా వ్యవసాయం చేస్తామని ప్రశ్నించారు.
2,389 మంది పిల్లలు దూరం
మరియుపోల్‌తో పాటు కీవ్, ఖార్కివ్, సుమీ, చెర్నిహివ్, జపోరిజ్జియాలపైనా.. రష్యా దాడుల తీవ్రతను మరింత పెంచింది. కీవ్‌లో భారీగా బాంబుదాడులు జరిగే అవకాశం ఉండటం వల్ల కర్ఫ్యూ విధించారు. రాజధాని కీవ్‌కు శివారు మక్రీవ్ ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉండగా.. తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. డాన్‌బాస్ ప్రాంతంలోని వేలాది మంది పిల్లలను రష్యాకు బలవంతంగా తరలించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఒకే రోజు 2,389 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు దూరం చేశారని తెలిపింది. రష్యా ప్రధాన లక్ష్యం రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోవడమేనని ఉక్రెయిన్ అధ‌్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ తెలిపారు. దానికి వారు ప్రయత్నిస్తే అది రష్యాకు ఆత్మహత్యా సదృశ్యమేనని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం 2,3 వారాల్లో ముగుస్తుందని ఒలెక్సీ పేర్కొన్నారు.
35 లక్షల మంది వలస