Ukraine Russia War: రష్యాతో యుద్ధం నేపథ్యంలో.. దేశ ప్రజల్లో ఉక్రెయిన్ స్ఫూర్తి నింపుతూనే ఉంది. తొలుత యువత సహా ఎవరైనా స్వచ్ఛందంగా యుద్ధంలో భాగస్వామ్యం కావాలని కోరిన అధ్యక్షుడు జెలెన్స్కీ తన ప్రసంగాలతో ప్రేరణ కల్పిస్తున్నారు. యుద్ధాన్ని నివారించేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. అమెరికా సహా ఐరోపా దేశాల ఆంక్షలతో.. రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నం చేసిన జెలెన్స్కీ.. అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. ఐక్యరాజ్యసమితిలో రష్యా చర్యలను వ్యతిరేకించే దిశగా ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పుడు మరింత విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు.
'అమ్మల్లారా.. మీ కుమారుల్ని తీసుకెళ్లండి'
యుద్ధానికి వచ్చి తమకు చిక్కిన/చనిపోయిన వేలాది రష్యా సైనికులను.. కీవ్‌కు వచ్చి వెనక్కి తీసుకెళ్లాలని వారి తల్లుల్ని కోరింది ఉక్రెయిన్. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్‌లు చేస్తోంది ఆ దేశ రక్షణ శాఖ. అందుకోసం వారికి పలు సూచనలు కూడా చేసింది. ఎలా రావాలో, వారి వివరాలు ఎలా తీసుకోవాలో కూడా అందులో పేర్కొంది.
''అమ్మా! మీ కుమారుడు(యుద్ధ ఖైదీ) ఇక్కడ మీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకవేళ ఉక్రెయిన్‌కు వస్తే.. మీరు వారిని తీసుకెళ్లొచ్చు.''
- ఫేస్బుక్ పోస్ట్‌లో ఉక్రెయిన్ రక్షణ శాఖ
Russian Casualties in Ukraine: యుద్ధం జరుగుతున్నప్పటినుంచి సుమారు 6 వేల మంది రష్యా సైనికుల్ని చంపినట్లు జెలెన్స్కీ ప్రకటించారు. తమ సైనికుల మృతిపై తొలిసారి రష్యా ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై దాడుల ఘటనలో 498 మంది సైనికులు మరణించినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. మరో 1,597 మంది గాయపడ్డారని పేర్కొంది.
మరోవైపు 2,870 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని.. 3,700 మందికిపైగా గాయపడ్డారని కోనాషెంకోవ్ తెలిపారు. 572 మంది ఇతరులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే దీనిని ఉక్రెయిన్ ఇంకా ధ్రువీకరించలేదు.