తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2022, 6:54 AM IST

ETV Bharat / international

ఉక్రెయిన్​ నగరాలపై రష్యా విధ్వంసం.. 'అదే జరిగితే అణు యుద్ధమే'

Ukraine Russia War: వరుస దాడులతో ఉక్రెయిన్​లో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా వైఖరిపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. రష్యా అమానుషంగా ప్రవర్తిస్తోందని.. ఉక్రెయిన్​ చరిత్రను చెరిపేందుకు ప్రయత్నిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

Russia Ukraine news
ఉక్రెయిన్ రష్యా యుద్ధం

Ukraine Russia War: తీవ్రతలో ఒక్కోరోజు కాస్త హెచ్చుతగ్గులు ఉంటున్నా.. ఉక్రెయిన్‌పై నిప్పుల వానను రష్యా కొనసాగిస్తోంది. కీవ్‌, ఖర్కివ్‌ నగరాలపై, ముఖ్యంగా జనసమ్మర్ద ప్రాంతాలపై బుధవారం వరసగా ఏడోరోజు కూడా రష్యా రాకెట్లు, క్షిపణులు దూసుకువెళ్లి విధ్వంసం సృష్టించాయి. ఏకబిగిన చోటుచేసుకుంటున్న పేలుళ్ల శబ్దాల షాక్‌ నుంచి ప్రజలు వెంటనే తేరుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ తునాతునకలైన భవంతులు చూసినవారికి గుండె గుభేల్‌మంటోంది. తమ చెంతనే బాంబులు పడిన దృశ్యాలు మది నుంచి చెదిరిపోక భీతిల్లుతున్నారు. మరిన్ని చర్చలకు సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతూనే దురాక్రమణ యత్నాలను రష్యా కొనసాగిస్తుండడాన్ని అమెరికా సహా ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. దీనికి తగిన మూల్యాన్ని రష్యా చెల్లించుకోకపోతే అది ఒక్క ఉక్రెయిన్‌ ఆక్రమణతో ఆగిపోదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.

కీవ్​లో కూలిపోయిన వంతెనను పరిశీలిస్తున్న ఉక్రెయిన్ సైనికులు

రష్యా తీరును ఐరాస సర్వ ప్రతినిధి సభ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా నిలిచింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ మాట్లాడారు. భారత విద్యార్థుల్ని సురక్షితంగా తరలించేందుకు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఈ తరుణంలోనే పంజాబ్‌కు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయారు. తక్షణం ఖర్కివ్‌ను వీడాలని భారత్‌ తమ విద్యార్థులకు సూచించింది. మూడో ప్రపంచ యుద్ధమంటూ మొదలైతే అది అణ్వస్త్ర పోరే అవుతుందని, పెను విధ్వంసానికి కారణమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హెచ్చరించడం గమనార్హం.

చర్చలు ఎప్పుడో?

ప్రతిష్టంభన తొలగించడానికి చర్చలు జరపాలని ఉభయ పక్షాలు నిర్ణయించినా అవి ఎప్పుడు, ఎక్కడ అనేది తేల్చలేదు. తొలివిడత చర్చలు విఫలమైన వెంటనే దాడుల తీవ్రతను రష్యా మరిన్ని రెట్లు పెంచిన విషయం తెలిసిందే. చర్చలకు తాము సుముఖమే అయినా ముందుగా దాడులు ఆపాలని ఉక్రెయిన్‌ ఇదివరకే చెప్పింది. చర్చలకు బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. రష్యా డిమాండ్లలో మార్పు లేదని, అల్టిమేటంలకు లొంగేది లేదని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ద్మిత్రీ కులేబా చెప్పారు. చర్చలు గురువారం బెలారస్‌లో జరిగే అవకాశం ఉంది.

ఆసుపత్రినీ, వర్సిటీని వదల్లేదు

బుధవారం చెర్నిహైవ్‌ నగరంలో ఒక ఆసుపత్రిపై రెండు క్రూయిజ్‌ క్షిపణులతో రష్యా దాడి చేసింది. భవంతి దెబ్బతిన్నా పూర్తిస్థాయిలో నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖర్కివ్‌లో ప్రాంతీయ పోలీసు, నిఘా విభాగ ప్రధాన కార్యాలయంపైనా దాడి చోటుచేసుకుంది. దీనిలో నలుగురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు. దాడి తీవ్రతకు ఈ భవనం పైఅంతస్తు అగ్నికీలల్లో ఆహుతయింది. కాన్‌స్టిట్యూషన్‌ స్క్వేర్‌ కూడా బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖర్కివ్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ భవంతిని సయితం వదిలిపెట్టకుండా దాడి చేశారు. దీంతో విశ్వవిద్యాలయం చాలావరకు దెబ్బతింది.

రష్యా క్షిపణి దాడుల కారణంగా ఖర్కివ్ నేషనల్ యూనివర్సిటీ భవనంలో చెలరేగుతున్న మంటలు

క్లస్టర్‌ బాంబుల్ని ప్రయోగిస్తోందా?

దాడుల్లో క్లస్టర్‌ బాంబుల్ని, ఇస్కాండర్‌ క్షిపణుల్ని రష్యా వాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. క్షణమైనా దాడుల్ని ఆపకపోవడం వల్ల క్షతగాత్రులను చేరుకోవడం కష్టమవుతోందని మరియుపొల్‌ మేయర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లోకి దళాలను పంపించేందుకు రష్యా మిత్రదేశమైన బెలారస్‌ ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపింది. తమపై ఆంక్షలు విధిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా ఆంక్షలు అమలు చేయాలని రష్యా యోచిస్తున్నట్లు క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు అందించే సాయాన్ని ఈయూ మరింత పెంచింది. రష్యా దాడుల నుంచి తప్పించుకుని వస్తున్నవారికి తాత్కాలిక అనుమతి పత్రాలతో తమ దేశాల్లో రక్షణ కల్పించే దిశగా యోచిస్తోంది. ఉక్రెయిన్‌ నుంచి 8.74 లక్షల మంది వలస వెళ్లిపోయారనీ, త్వరలోనే ఇది 10 లక్షలు దాటుతుందని ఐరాస శరణార్థుల సంస్థ అంచనా వేసింది.

ఉక్రెయిన్​లోని జైటోమిర్​ నగరంలో ధ్వంసమైన నివాస భవనాలు

చనిపోయిన రష్యా సైనికులు 498 మంది

వారం రోజుల యుద్ధంలో రష్యాకు అపారమైన నష్టం కలిగిందన్న వార్తల్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. "ఉక్రెయిన్‌లో 498 మంది రష్యా సైనికులు చనిపోయారు. 1,597 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌కు చెందిన 2,870 మంది సైనికులు చనిపోగా.. 3,700 మంది గాయపడ్డారు. 572 మందిని బందీలుగా పట్టుకున్నాం" అని తొలిసారిగా బయటపెట్టింది. 2,000 మందికిపైగా పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ అత్యవసర సేవల విభాగం తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఖర్కివ్‌లో 21 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. కీవ్‌పై దండయాత్రకు 64 కి.మీ. పొడవున తరలివస్తున్న రష్యా సైనిక వాహనాలు ఆ నగరానికి మరింత సమీపిస్తున్నాయి. కీవ్‌, ఖర్కివ్‌లకు అదనంగా ఖేర్సన్‌ వంటి ఇతర నగరాలు, పట్టణాలపైనా రష్యా దృష్టి సారించింది. చెర్నోబిల్‌ ప్లాంటుతో పాటు ఉక్రెయిన్‌లోని అతిపెద్ద అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా నుంచి లేఖ అందిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. అణు కర్మాగారాల్లో భద్రత చర్యలపై తక్షణ సాయం అందించాలని ఇదే సంస్థను ఉక్రెయిన్‌ కోరింది.

రష్యా అమానుషంగా వ్యవహరిస్తోంది

హోలోకాస్ట్‌ వంటి చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తూ ఉక్రెయిన్‌ చరిత్రను చెరిపేయాలని రష్యా చూస్తోంది. ప్రార్థన స్థలాలనూ విడిచిపెట్టేలా లేరు. రష్యా చర్యలు అమానుషంగా ఉన్నాయి. మన చరిత్రను, దేశాన్ని, మనందరినీ తుడిచిపెట్టేయాలని వారికి (రష్యా సైనికులకు) ఆదేశాలున్నాయి.

-వొలొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

అదే జరిగితే అణు సమరమే: రష్యా

మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే అది అణ్వస్త్రపోరే అవుతుందని రష్యా పేర్కొంది. రష్యాపై కఠిన ఆంక్షలకు ప్రత్యామ్నాయం మూడో ప్రపంచ యుద్ధమేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చేసిన వ్యాఖ్యను అల్‌జజీరా టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్‌రొవ్‌ ప్రస్తావించారు. తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. రెండో విడత చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా ఉక్రెయిన్‌ మాత్రం అమెరికా నుంచి అందుతున్న ఆదేశాలతో జాప్యం చేస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి :రెండోసారి పుతిన్​తో మోదీ ఫోన్ సంభాషణ

ABOUT THE AUTHOR

...view details