Ukraine Russia war: "నేను దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడం మాత్రం మానను. నా దేశాన్ని ఓడిపోనివ్వను".. ఉక్రెయిన్‌కు చెందిన 79ఏళ్ల బామ్మ వాలెంటినా కోన్‌స్టాంటీనొవాస్కా ఉద్విగ్నంగా చెప్పిన మాటలివి. ఆమే కాదు.. ఉక్రెయిన్‌లో నాలుగేళ్ల చిన్నారి నుంచి వృద్ధుల వరకూ.. ఎవర్ని కదిలించినా ఇదే భావోద్వేగం. రష్యా ఆక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం అక్కడ చిన్నా పెద్దా కదిలి వస్తున్నారు. యుద్ధం ఎదురైతే 'మేము సైతం' అంటూ తుపాకులతో శిక్షణ తీసుకుంటున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లో దాదాపు లక్షన్నర మంది సైనికులను మోహరించింది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో ఉక్రెయిన్ సైన్యం సర్వ శక్తులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆ దేశ ప్రజలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. సామాన్య పౌరులు కూడా ఆయుధాల వాడకంపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణకు చిన్నారులు, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో 79 ఏళ్ల వాలెంటినా కూడా ఈ ట్రెయినింగ్‌లో పాల్గొని జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే - 47 తుపాకీని ఎలా ఉపయోగించాలో శిక్షణ తీసుకున్నారు. తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వయసు కూడా పక్కనబెట్టి దేశం కోసం ముందుకొచ్చిన వాలెంటినాను ఉక్రెయిన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు.