Ukraine Russia War: ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్న అమెరికా శుక్రవారం మళ్లీ కొరడా ఝళిపించింది. రష్యా వాణిజ్య స్థాయిని తగ్గించాలని నిర్ణయించింది. ఆ దేశానికి వాణిజ్యపరంగా ఇస్తున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్) హోదాను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ విషయంలో ఐరోపా సమాఖ్య (ఈయూ), జీ-7 దేశాల కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. అంతేకాదు రష్యా సముద్ర ఉత్పత్తులు, మద్యం, వజ్రాలపై నిషేధం విధించింది. "పుతిన్‌ను ఎదుర్కొవడానికి స్వేచ్ఛా ప్రపంచం ముందుకు వస్తోంది" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేస్తే.. రష్యా దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించే వెసులుబాటు అమెరికాకు కలుగుతుంది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్విఫ్ట్ నుంచి రష్యాను తప్పించడం సహా ఆ దేశ చమురు ఉత్పత్తులపై బైడెన్ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌ఎన్ హోదా పోతే.. క్యూబా, నార్త్ కొరియా దేశాల సరసన రష్యా చేరుతుంది. ఇప్పటికే రష్యా ఎంఎఫ్‌ఎన్ హోదాను కెనడా రద్దు చేసింది.
రష్యా, బెలారస్‌లకు ఎగుమతులపై ఆంక్షలు
రష్యాను కట్టడి చేసేందుకు వరుస ఆంక్షలను విధిస్తున్న అమెరికా మరో కీలక ప్రకటన చేసింది. రష్యా సహా ఆ దేశానికి సహకరిస్తున్న బెలారస్‌లకు లగ్జరీ వస్తువులను ఎగుమతులు చేయడంపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రతినిధి నెడ్ ప్రిన్స్ వెల్లడించారు. ఇప్పటికే ఐరోపా సమాఖ్య కూడా లగ్జరీ వస్తువులపై నిషేధం విధించింది.
యూట్యూబ్ ఆంక్షలు
యూట్యూబ్‌లోని రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానెళ్లను బ్లాక్ చేస్తున్నట్లు సంబంధిత సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నట్లు తెలిపింది.
మెలిటొపోల్ మేయర్ కిడ్నాప్
దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటొపోల్‌ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు.. శుక్రవారం ఆ నగర మేయర్‌ను కిడ్నాప్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చాయి.
ఆయుధాలతో వచ్చిన కొంతమంది మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ఫెదొరోవ్‌ను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్ కిరిల్ తిమోషెంకో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. శత్రు సైనికులకు సహకరించట్లేదని అయనను అపహరించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ కిడ్నాప్‌ను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. "రష్యా ఉగ్రవాదం కొత్త దశలోకి మారింది. చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఈ చర్యలు ఐసిస్ ఉగ్రవాదుల కంటే తక్కువేం కాదు" అని జెలెన్‌స్కీ మండిపడ్డారు. మెలిటొపోల్ నగరాన్ని ఫిబ్రవరి 26నే రష్యా హస్తగతం చేసుకుంది.
ప్రతి 30 నిమిషాలకు దాడులు..