తెలంగాణ

telangana

ETV Bharat / international

రక్షణ సాయంపై జో బైడెన్​తో మాట్లాడిన జెలెన్​స్కీ

ukraine russia
ఉక్రెయిన్

By

Published : Mar 1, 2022, 6:53 AM IST

Updated : Mar 2, 2022, 7:18 AM IST

00:42 March 02

రక్షణ సాయంపై జో బైడెన్​తో మాట్లాడిన జెలెన్​ స్కీ..

ఉక్రెయిన్​ పై రష్యా కొనసాగిస్తున్న సైనిక చర్య నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో మాట్లాడారు. రష్యా పై మరిన్ని ఆంక్షలతో పాటు రక్షణ సాయం పై చర్చించినట్లు జెలెన్​స్కీ తెలిపారు. వీలైనంత త్వరగా రష్య దండ్రయాత్రను అడ్డుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఉక్రెయన్​ సంక్షోభంలో నేపథ్యంలో నాటో దేశాల విదేశాంగ మంత్రులు అంతా శుక్రవారం సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రష్యా క్రీడాకారులపై ప్రపంచ అథ్లెటిక్​ సమాఖ్య నిషేధం..

ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో అంతర్జాతీయ వేదికల్లో పాల్గొనకుండా రష్యా క్రీడాకారులపై ప్రపంచ అథ్లెటిక్‌ సమాఖ్య నిషేధం విధించినట్లు ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అన్నిరకాల క్రీడలపై ఈ నిషేధం విధించినట్లు తెలిపింది. ఇప్పటికే ఫిఫా, యూఈఎఫ్‌ఏలు ఈ ఏడాది జరగనున్న పుట్‌బాల్‌ ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ టోర్నీల నుంచి నుంచి రష్యా జట్లను బహిష్కరించిన విషయం తెలిసిందే.

22:12 March 01

టీవీ టవర్​ ధ్వంసం- ఐదుగురి మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని టెలివిజన్ టవర్​పై రష్యా సైన్యం చేసిన దాడిలో ఐదుగురి మృతి చెందారు.

21:32 March 01

60 శాతం మంది వెనక్కి...

ఉక్రెయిన్ నుంచి 60 శాతం మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ వెల్లడించింది. తొలి అడ్వైజరీ జారీ చేసిన సమయంలో ఆ దేశంలో 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా వేసిన కేంద్రం.. 12 వేల మంది ఉక్రెయిన్ నుంచి భారత్​కు తిరిగి వచ్చారని తెలిపింది.

21:14 March 01

టీవీ టవర్​ ధ్వంసం..

ఉక్రెయిన్ రాజధాని కీవ్​లోని టెలివిజన్ టవర్​పై రష్యా సైన్యం దాడి చేసింది. ఫలితంగా సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడిందని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారుడు ఆంటోన్ హెరాష్చెంకో తెలిపారు.

21:08 March 01

ఎనిమిది మంది మృతి

ఉక్రెయిన్​లోని ఖార్కివ్ రెసిడెన్షియల్ బ్లాక్​పై రష్యా వైమానిక దళం జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారు.

19:43 March 01

చర్చలకు కొత్త తేదీ

రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు మార్చి 2న జరగనున్నాయి. కాల్పుల విరమణ అంశంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.

18:19 March 01

మోదీ కీలక భేటీ

ఉక్రెయిన్​ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. పౌరుల తరలింపు ప్రక్రియ, తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

మరోవైపు, ఆపరేషన్ గంగలో భాగంగా రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి.. భారత పౌరులతో కూడిన మరో ప్రత్యేక విమానం దిల్లీకి బయల్దేరింది.

17:52 March 01

జెలెన్‌స్కీకి యురోపియన్ పార్లమెంట్‌ స్టాండింగ్ ఒవేషన్

రష్యాపై పోరులో వెనకడుగు వేయకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఒకవైపు దేశ ప్రజలకు ధైర్యాన్ని చెబుతూనే.. ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. దీంతో జెలెన్‌స్కీ పోరాట పటిమను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. తాజాగా యురోపియన్ పార్లమెంట్‌లోని సభ్యులు ఆయన పోరాటానికి నిలబడి ప్రశంసలు అందజేశారు.

యురోపియన్ పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ వర్చువల్​గా మాట్లాడారు. తమ భూమికోసం పోరాడుతున్నట్లు, తమను ఎవరూ విడదేయలేరని భావోద్వేగంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా యురోపియన్ పార్లమెంట్‌లోని సభ్యులు ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

17:41 March 01

యుద్ధంతో ఉక్రెయిన్‌లో 10లక్షల మంది నిరాశ్రయులు: ఐరాస

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులను ఉద్ధృతం చేశాయి. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైనా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. ఒకిట్రికా సైనిక స్థావ‌రంపై దాడిలో 70మంది ఉక్రెయిన్ సైనికులు, ఖర్కివ్‌లో 11 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది రష్యా.

కీవ్‌ వైపు ట్యాంకులు, ఫిరంగులతో రష్యా బలగాలు దూసూకొస్తున్నాయి. మారియుపోల్‌ సహా ముఖ్య నగరాల్లో ఇరుసైన్యాల మధ్య భీకరపోరు సాగుతోంది.

రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లకుండా స్థానిక ప్రజలు వేలాది సంఖ్యలో అడుకుంటున్నారు.

రష్యా 56రాకెట్లు, 113 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. దాడుల్లో 14మంది చిన్నారులు సహా 352మంది పౌరులు మృతి చెందినట్లు పేర్కొంది.

దాడులతో ఉక్రెయిన్‌లో 10లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐరాస ప్రకటించింది. ఉక్రెయిన్‌ నుంచి 6.60లక్షల మందికిపైగా తరలివెళ్లినట్లు వివరించింది.

16:55 March 01

ఖార్కివ్‌ నగరంపై క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా నగరంలోని సెంట్రల్ స్క్వేర్‌ను రష్యా క్షిపణి తాకినట్లు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ చెప్పారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

15:38 March 01

విద్యార్థులను క్షేమంగా తీసుకురావడమే లక్ష్యం: రిజిజు

ఉక్రెయిన్​ నుంచి విద్యార్థులను తరలించే విషయంపై స్లోవేకియాతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం అంటున్నారు కేంద్రం మంత్రి రిజిజు. విసాల జారీ విషయంలో వారి సాయాన్ని కోరుతామన్నారు. విద్యార్థులను క్షేమంగా తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

15:16 March 01

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. కర్ణాటక హవేరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సదరు విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

15:11 March 01

సైనిక చర్యలో పాల్గొనే ఆలోచన లేదు: బెలారస్‌ అధ్యక్షుడు

ఉక్రెయిన్‌లో రష్యా చేపడుతోన్న సైనిక చర్యలో పాల్గొనే ఆలోచన తమకు లేదని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మంగళవారం వెల్లడించారు. బెలారస్ భూభాగం నుంచి రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయనే ఆరోపణలనూ ఆయన ఖండించినట్లు అధికారిక వార్తాసంస్థ బెల్టా తెలిపింది.

14:13 March 01

దిల్లీ చేరుకున్న మరో విమానం

'ఆపరేషన్​ గంగ'లో భాగంగా ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులతో.. హంగేరీ నుంచి బయలుదేరిన విమానం దిల్లీ చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వారికి స్వాగతం పలికారు. ఉక్రెయిన్​లో ఉన్న ప్రతీ ఒక్క భారతీయుడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

14:01 March 01

దూసుకెళ్తున్న ఆసియా మార్కెట్లు..

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు.. ఉక్రెయిన్​- రష్యా చర్చలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆసియా స్టాక్​ మార్కెట్లు చాలావరకు లాభాల్లో ఉన్నాయి. ఆరంభ ట్రేడింగ్​లో టోక్యో, సిడ్నీ, షాంఘై సూచీలు పుంజుకున్నాయి.

14:01 March 01

ఇజ్రాయెల్​ సాయం

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్​కు సాయం అందించనున్నట్లు ప్రకటించింది ఇజ్రాయెల్​. వైద్య పరికరాలు, నీటిశుద్ధి యంత్రాలు, టెంట్లు, బ్లాంకెట్లు, కోట్​లు వంటివి సరఫరా చేస్తున్నట్లు ఇజ్రాయెల్​ అధికారులు వెల్లడించారు. వీటిని విమానాల్లో పోలండ్​కు తరలించి అక్కడి నుంచి ఉక్రెయిన్​కు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

13:42 March 01

సెంట్రల్​ స్క్వేర్​పై దాడి

కీవ్​ నగరమే లక్ష్యంగా దూసుకెళ్తున్న రష్యన్​ సైన్యం ఉక్రెయిన్​లోని రెండో అతిపెద్ద పట్టణమైన ఖార్కివ్​పై దాడి చేసింది. ఆ నగరంలోని సెంట్రల్​ స్క్వేర్​ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ప్రభుత్వ కార్యాలయాలు సహా నివాసిత ప్రాంతాలు కూడా ధ్వంసమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడిలో ఎంతమంది స్థానికులు మృతిచెందారు అనే విషయంపై స్పష్టత లేదు. అంతకుముందు సోమవారం జరిగిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

12:21 March 01

కీవ్​లోని భారతీయులకు హెచ్చరిక

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లాలంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.

11:52 March 01

సీ-17 విమానాల ద్వారా తరలింపు

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్​ గంగను వేగవంతం చేసేందుకు వాయుసేన రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వాయుసేనకు చెందిన సీ-17 విమానాలను ఇందుకు వినియోగించనున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో మరింత మందిని తరలించేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

11:12 March 01

ఉక్రెయిన్​ పరిణామాలపై రాష్ట్రపతికి వివరించిన మోదీ..

ఉక్రెయిన్​ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు వివరించారు. ఈ మేరకు మోదీ రాష్ట్రపతిని కలిసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్​లోని భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు చేపట్టిన 'ఆపరేషన్​ గంగ' గురించి రాష్ట్రపతికి వెల్లడించారు.

10:48 March 01

కీవ్‌ వైపు భారీ రష్యన్‌ సాయుధ కాన్వాయ్‌..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్‌ వైపు రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ని ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్‌ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తోపాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్‌, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు.

10:48 March 01

350 మంది పౌరులు మృతి: ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా తన దండయాత్ర సాగిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలు ఆంక్షల పేరుతో రష్యాపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. పుతిన్‌ వెనుకడుగు వేయట్లేదు. తొలుత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

10:13 March 01

ఉక్రెయిన్​ సైనిక స్థావరంపై దాడి

ఉక్రెయిన్​లోని కీవ్​-ఖార్​కివ్​ మధ్య ఉన్న ఒఖ్​తిర్కా మిలిటరీ బేస్​పై రష్యన్​ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ సైనికాధికారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్​ చేశారు. ఇరు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్​ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలిపారు.

09:37 March 01

ఉక్రెయిన్​కు ఆస్ట్రేలియా సాయం

రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్​కు సాయం అందించనున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా. 50 మిలియన్​ డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఉక్రెయిన్​కు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ వెల్లడించారు.

09:36 March 01

ఐరాసలోని రష్యా బృందం బహిష్కరణ

రష్యాపై ఆంక్షలను కట్టుదిట్టం చేస్తున్న అమెరికా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐరాసలో రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా వెల్లడించారు.

08:08 March 01

భారత్​ చేరుకున్న మరో విమానం

ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే క్రమంలో ఇప్పటికే ఆరు విమానాలు భారత్​ చేరుకోగా ఇప్పుడు మరో విమానం ముంబయిలో ల్యాండ్​ అయింది. బుచారెస్ట్​ నుంచి బయలుదేరిన ఈ విమానం ద్వారా 182 మంది భారతీయులు స్వదేశాన్ని చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి నారాయణ్​ రాణె స్వాగతం పలికారు.

08:08 March 01

రష్యాకు మరో ఎదురుదెబ్బ

ఉక్రెయిన్​పై దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే వివిధ ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్​ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్​ఎఫ్​) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్​పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. త్వరలో చర్చల ద్వారా మరో వేదికను నిర్ణయించనున్నట్లు ఐఐహెచ్​ఎఫ్​ స్పష్టం చేసింది.

అంతేకాదు.. ఐఐహెచ్​ఎఫ్​ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో రష్యా, బెలారస్​ దేశాలకు చెందిన జట్లు, క్లబ్​లు పాల్గొనడంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.

07:10 March 01

భారత్​కు బయలుదేరిన మరో రెండు విమానాలు

ఆపరేషన్​ గంగలో భాగంగా మరో రెండు విమానాలలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువస్తోంది. బుడాపెస్ట్​ నుంచి 216 మందితో ఓ విమానం, బుచారెస్ట్​ నుంచి 218 మందితో మరో విమానం దిల్లీకి బయలుదేరాయి.

06:21 March 01

ఉక్రెయిన్​-రష్యా యుద్ధంపై భారత్​ ఆందోళన

Ukraine Russia War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్​ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దాడులకు ముగింపు పలకాలని.. చర్చల ద్వారానే విభేదాలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది. సోమవారం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత్ తరపున పాల్గొన్న ​ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దౌత్య మార్గం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత ప్రభుత్వం విశ్వసిస్తుందని పేర్కొన్నారు.

Last Updated : Mar 2, 2022, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details