Ukraine Russia war: ఉక్రెయిన్‌పై దాడి చేయాలన్న ప్రణాళికను రష్యా మరింత ముందుకు తీసుకెళ్లిందని అమెరికా పేర్కొంది. యుద్ధం కోసం తుది ఏర్పాట్లు చేసుకోవాలని రష్యా సైనిక కమాండర్లు.. ముందు వరుసలో ఉండే దళాలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది. దీనిపై నిఘా వర్గాల సమాచారం తమకు అందిందని అమెరికా అధికారులు చెప్పారు.
Ukraine Russia war final preparation
ఈ నేపథ్యంలో అమెరికా చర్చల ప్రతిపాదన చేసింది. యుద్ధాన్ని నివారించేందుకు పుతిన్‌తో బైడెన్ చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. రానున్న రోజుల్లో రష్యా దాడి చేయకుండా ఉంటే తాను కూడా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ను కలవనున్నట్లు తెలిపారు.
ఉద్రిక్త పరిస్థితులు
ఉక్రెయిన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఫిరంగి దాడులతో తూర్పు ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెయిన్ సైనికాధికారులపై మోర్టార్లు, ఫిరంగులు ప్రయోగిస్తున్నారు. ఇవన్నీ రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధభయాలను మరింత పెంచుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
కాల్పుల విరమణ పాటించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదనకు రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఎక్కడ కలుద్దామో చెప్పాలని పుతిన్‌ను కోరారు. తమ దేశం దౌత్యమార్గంలోనే శాంతియుత పరిష్కారం కోసం చూస్తోందని స్పష్టం చేశారు.
Russia Nuclear Drills: అయితే, రష్యా మాత్రం దూకుడుగానే ముందుకెళ్తోంది. శనివారం భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. అణుబాంబులను మోసుకెళ్లే బాలిస్టిక్ క్షిపణులు ఇందులో పాల్గొన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా.. ఈ విన్యాసాలను వీక్షించారు. సైనిక సన్నద్ధతపై సమీక్షించారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్షా 50 వేలకు పైగా జవాన్లను మోహరించినట్లు తెలుస్తోంది. భారీగా ఆయుధ సంపత్తి సైతం వీరి వెంట ఉంది.
ఇదీ చదవండి:పుతిన్‌తో చర్చలకు బైడెన్ సిద్ధం: అమెరికా