తెలంగాణ

telangana

ETV Bharat / international

సుమీలో 700 మంది భారత విద్యార్థులు- 7 రోజులుగా బిక్కుబిక్కుమంటూ.. - ఉక్రెయిన్ రష్యా వార్తలు

Ukraine Russia War: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం 'ఆపరేషన్​ గంగ' పేరుతో స్వదేశానికి తీసుకువస్తోంది. అయితే సుమీ నగరంలోని విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయాన్ని 'ఈటీవీ భారత్​'కు ఫోన్లో వివరించిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఆ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోయారు.

indian ukraine
మాతృభూమికి చేరే దారేది?

By

Published : Mar 4, 2022, 7:55 AM IST

Ukraine Russia War: ఆకాశంలో యుద్ధ విమానాల రొద.. వీధుల్లో ట్యాంకుల మోత.. మర తపాకుల గర్జనలు.. భవనాలపై బాంబుల పేలుళ్లు.. ఎటు చూసినా మృత్యువు కోరలు చాచిన ఆనవాళ్లే. దేశం కాని దేశం ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. ఎలా బయటపడాలో తెలియదు.. క్షణక్షణం.. భయంభయం. గత వారం రోజులుగా ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్న భారతీయ విద్యార్థుల దీన స్థితి ఇది. సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని దౌత్య కార్యాలయ అధికారులు హామీ ఇస్తున్నా కార్యరూపం దాల్చలేదని, దీంతో నిరీక్షణలే తమకు మిగిలాయని ఆ నగరంలో చిక్కుకుపోయిన 700 మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా తాము ఎదుర్కొంటున్న కష్టాలను వారు 'ఈటీవీ భారత్‌'కు ఫోన్‌లో వివరించారు. తక్షణమే తమను భారత్‌కు తరలించేలా చూడాలని కోరారు.

ఈశాన్య ఉక్రెయిన్‌లోని చిన్న నగరం సుమీ. ఈ నగరానికి తూర్పున రష్యా సరిహద్దులు 50 కి.మీ దూరంలో, పశ్చిమాన పోలండ్‌, హంగరీ, రొమేనియాలు 1200 నుంచి 1500 కి.మీ.దూరంలో ఉంటాయి.

సుమీ స్టేట్‌ యూనివర్సిటీలో 700 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి అక్కడి భారత దౌత్య అధికారులతో మాట్లాడుతూనే ఉన్నామని ముస్కన్‌ అనే విద్యార్థిని తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండమని సూచిస్తున్న ఆ అధికారులు త్వరలోనే తీసుకెళతామంటున్నా ఇంత వరకు తమ వద్దకే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కట్టడాలన్నీ పాతవేనని, బాంబు దాడుల నుంచి తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్లు వంటివి ఇక్కడ లేవని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనంలోనే గ్రౌండ్‌ ఫ్లోరులో తలదాచుకున్నట్లు వెల్లడించారు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు ఒకట్రెండు రోజులకే సరిపోతాయన్నారు. ఖర్కివ్‌, కీవ్‌ నగరాల నుంచి సరిహద్దులు దాటిన విద్యార్థులను విమానాల ద్వారా భారత్‌కు తరలించినట్లు తెలుస్తోందని, తాము ఇంకా ఎన్ని రోజులు సుమీ నగరంలో నిరీక్షించాలో అర్థం కావడం లేదని వాపోయారు. కరోనా సమయంలో తమను స్వదేశానికి తీసుకెళ్లిన విధంగానే ఇప్పుడు కూడా తక్షణమే తరలించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

నవీన్‌ మృతితో తీవ్ర ఆందోళనలు

ఖర్కివ్‌ నగరంలో జరిగిన క్షిపణి, బాంబు దాడుల్లో నవీన్‌ శేకరప్ప అనే మెడిసిన్‌ నాలుగో సంవత్సర విద్యార్థి మృతి చెందారని తెలియడం వల్ల మరింత ఆందోళనకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు. శిథిల భవనాల వీడియోలను చూసిన తమ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని వివరించారు. ఉక్రెయిన్‌కు రష్యా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏమీ జరగదని ఇక్కడి ఏజెంట్‌ భరోసా ఇస్తూ వచ్చారని నిరంజన సంతోష్‌ అనే విద్యార్థిని తెలిపారు. విశ్వవిద్యాలయాలు కూడా 100శాతం హాజరు ఉండాలని చెప్పడం వల్ల ఉక్రెయిన్‌ను వీడి వస్తే ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని భావించినట్లు చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక 15 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించారన్నారు. బంకర్‌లలో రాత్రిళ్లు కరెంటు ఉండడం లేదని, వాటిల్లో జీవించడం అంత సులభమేమీ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమీ నగరం నుంచి ఎప్పుడు తరలిస్తారోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి :రష్యాకు ఈయూ షాక్.. కార్పొరేట్ సంస్థలూ దూరం..

ABOUT THE AUTHOR

...view details