UKRAINE RUSSIA TALKS: బెలారస్‌లోని గోమెల్ నగరంలో శాంతి చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ఆఫర్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. బెలారస్‌లోని పలు ప్రాంతాల నుంచి రష్యా దాడులు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమపై విరుచుకుపడని దేశాల్లో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. పోలండ్ రాజధాని వార్సా, టర్కీలోని ఇస్తాంబుల్, అజర్‌బైజాన్ రాజధాని బకూ వంటి ప్రాంతాలు చర్చలకు అనువైనవిగా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు గత రాత్రి ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాడులు అత్యంత క్రూరంగా కొనసాగాయని జెలెన్‌స్కీ తెలిపారు. సామాన్య పౌరులు నివసిస్తున్న ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకున్నారన్నారు. చివరకు అంబులెన్సులపైనా దాడి చేస్తున్నారని ఆరోపించారు.