Ukraine Russia News: ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా ఆ దేశసరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లేందుకు క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్లలో రష్యన్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి చేయొచ్చు అని అమెరికా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ ఫేస్బుక్ పోస్ట్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 16నే (బుధవారమే) ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని, ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉండాలని.. ఇందుకు ప్రతీకగా అదే రోజును ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
రాయబార కార్యాలయం తరలింపు..
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా.. పశ్చిమాన ఉన్న లివివ్ నగరానికి తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ వెల్లడించారు. సరిహద్దులో రష్యా బలగాల కదలికలు వేగవంతం అవడం వల్ల తమ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రష్యా ఇప్పటికే సరిహద్దులో లక్షకు పైగా సైనిక బలగాలను మోహరించింది. రష్యా చర్యలపై అమెరికా, నాటో దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా దాడి చేయవచ్చని అమెరికా హెచ్చరిస్తుంటే.. అలాంటిదేమీ లేదంటూ ఆ విషయాన్ని రష్యా ఖండిస్తూ వస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు.
ఇదీ చూడండి :ఉక్రెయిన్‌పై రష్యాకు ఎందుకంత కోపం..?