Ukraine India News: ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభానికి రష్యా కారణమంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. యుద్ధం విరమణ, మానవతా సంక్షోభాన్ని అడ్డుకోవడం తదితర చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఉక్రెయిన్ తీర్మానంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 193 దేశాలు ఉండగా.. 140 దేశాలు తీర్మానానికి అనకూలంగా ఓటు వేశాయి. మరో 38 దేశాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. మరో ఐదు దేశాలు ఉక్రెయిన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.
చర్చల ద్వారానే సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు భారత్ స్పష్టంచేసింది. అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది. ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమణ చేపట్టాలని పునరుద్ఘాటించింది. సామరస్యంగా యుద్ధం ముంగింపు, తక్షణ మానవతా సాయంపై ఐరాస దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. ముసాయిదా తీర్మానం వీటిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదని భారత్ పేర్కొంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో పరిస్థితులు.. వేగంగా క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.