ఉక్రెయిన్లో బస్సు హైజాక్ చేసిన ఘటనలో 12 గంటల ప్రతిష్టంభనకు తెరపడింది. సాయుధుడి చెర నుంచి 13 మంది ప్రయాణికులను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల అనంతరం దుండగుడు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేశారు.
వాయవ్య ఉక్రెయిన్లోని కైవ్కు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలోని లుట్స్క్ ప్రాంతంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో ఉన్న దుండగుడు ఓ బస్సును తన అధీనంలోకి తీసుకుని ప్రయాణికులను బంధించాడు. మంగళవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో అతడే ఫోన్ చేసి.. తాను మక్సిమ్ ప్లోఖోయ్ అని, ప్రయాణికులను బంధించానని చెప్పినట్లు ఆ దేశ హోంశాఖ సహాయ మంత్రి ఆంటోన్ గెరశ్ చెంకో తెలిపారు.
ఓ సందర్భంలో దుండగుడు బస్సు కిటికీలోంచి పేలుడు పదార్థాలను బయటకి విసిరాడని, పోలీసు డ్రోన్లపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఎవరీకి హాని జరగలేదని తెలిపారు. ప్రయాణికులను విడిపించేందుకు అతడితో చర్చలు జరిపామని పేర్కొన్నారు దేశాధ్యక్షుడు జెలెన్స్కీ. సుదీర్ఘ చర్చల అనంతరం అతడు లొంగిపోయినట్లు చెప్పారు.