తెలంగాణ

telangana

ETV Bharat / international

జెలెన్​స్కీ భిన్న వ్యాఖ్యలు.. రష్యాతో రాజీకి సంసిద్ధం?

Ukraine Crisis: రష్యాపై కడవరకూ పోరాడతామని, ఈ విషయంలో ఇసుమంతైనా వెనక్కు తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ. బ్రిటన్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్‌స్కీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. నాటో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయనని వెల్లడించారు. రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వతంత్ర భూభాగాలుగా గుర్తించిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ల విషయంలోనూ రాజీకి సిద్ధమని సంకేతాలిచ్చారు

Ukraine Crisis
Ukraine Crisis

By

Published : Mar 9, 2022, 7:30 AM IST

Ukraine Crisis: రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యాపై కడవరకూ పోరాడతామని, ఈ విషయంలో ఇసుమంతైనా వెనక్కు తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. తాము విడిచిపెట్టబోమని, యుద్ధంలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని, ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. బ్రిటన్‌ పార్లమెంటును ఉద్దేశించి మంగళవారం వీడియో ద్వారా ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాటి బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌ చేసిన 'నెవర్‌ సరెండర్‌' ప్రసంగాన్ని తలపించేలా మాట్లాడారు. షేక్‌స్పియర్‌ వ్యాఖ్యలనూ ఉటంకించారు. బ్రిటన్‌ పార్లమెంటును ఉద్దేశించి విదేశీ నేత ప్రసంగించడం ఇదే తొలిసారి.

అయితే అంతకుముందు 'ఏబీసీ న్యూస్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రష్యాతో నాటో యుద్ధం చేయదని, ఆ కూటమి సభ్యత్వం కోసం ఇక తాను ఒత్తిడి చేయబోనని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. "వివాదాస్పద అంశాలన్నా, రష్యాను ఎదుర్కోవాలన్నా నాటోకు భయం. అందుకే ఉక్రెయిన్‌ను చేర్చుకోవడానికి ఆ కూటమి సిద్ధంగా లేదు. ఈ విషయం అర్థమయిన తర్వాత నేను చల్లబడ్డాను. నాటో సభ్యత్వం కోసం ఇక నేను ఒత్తిడి చేయను. మోకాళ్లపై నిలబడి ప్రాధేయపడే దేశానికి నేను అధ్యక్షుడిని కాను" అని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వతంత్ర భూభాగాలుగా గుర్తించిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ల విషయంలోనూ రాజీకి సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని స్వతంత్ర భూభాగాలుగా రష్యా గుర్తించడంపై అడిగిన ప్రశ్నకు జెలెన్‌స్కీ బదులిస్తూ.. "ఈ రెండు ప్రాంతాలను ఒక్క రష్యా తప్ప మరే దేశాలూ గుర్తించలేదు. ఇవి సూడో రిపబ్లిక్‌లు. అయినప్పటికీ ఈ భూభాగాలు మున్ముందు ఎలా ఉండాలన్న దానిపై చర్చించి, రాజీకి వచ్చేందుకు నేను సిద్ధం. ఉక్రెయిన్‌లోనే ఉండాలని కోరుకుంటున్న ఈ భూభాగాల్లోని ప్రజలు ఎలా జీవించాలన్నదే మాకు ముఖ్యం. అధ్యక్షుడు పుతిన్‌ ఇక చేయాల్సింది చర్చలను ప్రారంభించడమే" అని పేర్కొన్నారు. దీంతో ఆయన రష్యాతో రాజీకి వస్తున్నారా? అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మిగ్‌-29 యుద్ధ విమానాలను ఇస్తాం: పోలండ్‌

తమకు యుద్ధ విమానాలు ఇవ్వాలని ఉక్రెయిన్‌ అభ్యర్థిస్తున్న తరుణంలో.. అమెరికా సూచన మేరకు తమ వద్దనున్న మిగ్‌-29 యుద్ధ విమానాలన్నింటినీ జర్మనీలోని అమెరికా వాయుసేన స్థావరానికి తరలించడానికి సంసిద్ధమని పోలండ్‌ ప్రకటించింది.

ఇదీ చూడండి:వెనక్కి తగ్గని రష్యా.. 500కిలోల బాంబుతో దాడి- 18 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details