Ukraine Crisis: పుట్టుకతోనే ఐదువేల అణ్వాయుధాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి ఉక్రెయిన్. కానీ, ప్రపంచ దేశాల మాటలు నమ్మి.. అణ్వాయుధాలు వదులుకొని.. జాతీయ భద్రతను వారి చేతిలో పెట్టినందుకు ఫలితం అనుభవిస్తోంది. దీనికి తోడు అవినీతి మర్రివూడల్లా వేళ్లూనుకోవడం.. పరాయి దేశాలకు అడుగులకు మడుగులొత్తే వారు అధికారంలోకి రావడం దానికి శాపంగా మారింది. ఫలితంగా దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తోంది. నాడు ముచ్చట్లు చెప్పిన దేశాలు ఒక్కటి కూడా పూర్తి సాయానికి రావడంలేదు. దీంతో మౌనంగా తమకు జరిగిన అన్యాయానికి ఉక్రెయిన్ వాసులు కుమిలిపోయే పరిస్థితి వచ్చింది.
మూడో అతిపెద్ద అణుశక్తిగా ఆవిర్భావం..
కోల్డ్ వార్ ముగిసే సమయానికి బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల కంటే అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశం ఉక్రెయిన్. ఈ దేశం ఆవిర్భవించే నాటికి రష్యా నుంచి వారసత్వంగా వచ్చిన దాదాపు 5 వేలకు పైగా అణ్వస్త్రాలు దీనికి ఉన్నాయి. సోవియట్‌కు చెందిన 43 రాకెట్ ఆర్మీ, 19వ రాకెట్ డివిజన్, 37వ గార్డ్స్ రాకెట్ డివిజన్, 46వ రాకెట్ డివిజన్, 50వ రాకెట్ డివిజన్‌లు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. వీటి వద్ద ఉన్న 175 ఖండాంతర క్షిపణులను ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల్లోని భూగర్భ బొరియల్లో భద్రపరిచింది. ఎస్‌ఎస్24 క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ క్షిపణులు ఒక్కోటి 10 థర్మో న్యూక్లియర్ అణ్వాయుధాలను ప్రయోగించగలదు. ఉక్రెయిన్ కంటే రష్యా, అమెరికా వద్ద మాత్రమే అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. 33 హెవీ బాంబర్లు కూడా ఉక్రెయిన్‌లో ఉన్నాయి. కొత్త పాలకులు వీటిని నిర్వహించే సైనికులు, కమాండర్లను దేశానికి విశ్వాసంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయమని కోరగా.. కొందరు నిరాకరించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
నమ్మి బుడాపెస్ట్ ఒప్పందంపై సంతకం..
ఉక్రెయిన్‌తో అణు నిరాయిధీకరణ చేయించేందుకు బ్రిటన్, రష్యా, అమెరికా చర్చలు జరిపాయి. 1994లో ఈ నాలుగు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ జనవరి 10వ తేదీన ఒక ప్రకటన చేశారు. 1994 డిసెంబర్ 5వ తేదీన హంగేరీ రాజధాని బుడాసెస్ట్‌లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు లియోనిడ్ కుచ్‌మా, బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ నాన్‌ప్రోలిఫరేషన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని బుడాపెస్ట్ ఒప్పందంగా పిలుస్తారు. దీని ప్రకారం ఉక్రెయిన్ అణ్వాయుధాలను నాశనం చేయాలి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి, నాటి సరిహద్దులను గౌరవించాలి. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఈ దేశాలు ఎటువంటి సైనిక శక్తిని ప్రయోగించకూడదు. వెంటనే ఉక్రెయిన్ ఒప్పందాన్ని అమలు చేసేలా సాయం చేయడానికి ఐరాస భద్రతమండలి రంగంలోకి దిగింది. వాస్తవానికి కీవ్‌కు అమెరికా సెనెట్ దీనిని సాధారణంగా ఆమోదించింది. అమెరికా ఇచ్చిన వాగ్దానం ‘చట్టపరమైన హామీ వలే’ పరిగణిస్తామని పేర్కొంది. కానీ, చట్టపరమైన హామీ అని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత 1996 నాటికి చిట్టచివరి అణ్వాయుధం కూడా రష్యాకు అప్పగించింది. ఈ ఒప్పందాన్ని శాంతి ఉద్యమకారులు, దౌత్యవేత్తలు గొప్ప విజయంగా చెప్పుకొంటారు.