Ukraine Crisis: ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రమైన తమ దేశంలోని జపోరిజియాపై రష్యా బాంబులు వేయడానికి తమ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కవ్వింపు చర్యలే కారణమని ఉక్రెయిన్ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్ గగనతలాన్ని 'నో-ఫ్లై జోన్'గా అమలు చేయడానికి నాటోను ఒప్పించేందుకే ఆయన ఈ పని చేశారని రష్యాకు చెందిన 'స్పుత్నిక్' వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు.
జపోరిజియా దగ్గర తమ సైన్యం అణుధార్మికత కాలుష్యానికి పాల్పడేందుకు యత్నిస్తోందంటూ ఉక్రెయిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని రష్యన్ ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. తద్వారా తమని కవ్వించేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. అణు విద్యుత్తు కేంద్రం సమీపంలో గస్తీకాస్తుండగా.. రష్యన్ బలగాలపై ఉక్రెయిన్ సైనికులు దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది. విద్యుత్తు కేంద్రం ఆవరణలో ఉన్న విద్య, శిక్షణా కేంద్రం నుంచి సైనికులు కాల్పులు జరిపారని పేర్కొంది. వీటిని తిప్పికొట్టే క్రమంలో తామూ కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించింది.
దీనిపై స్పందించిన అజరోవ్ "ఇది పూర్తిగా కవ్వింపు చర్య కిందకే వస్తుంది. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రం ఆవరణలో ఎట్టిపరిస్థితుల్లో ఇటు ఉక్రెయిన్‌గానీ, అటు రష్యాగానీ కాల్పులు జరపడానికి వీల్లేదు. ఏమాత్రం గురితప్పినా.. అది అతిపెద్ద అత్యవసర పరిస్థితిని దారితీసే ప్రమాదం ఉంది. ఇది పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన కవ్వింపు చర్యే. మరోవైపు జెలెన్‌స్కీ తక్షణ స్పందన కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. అమెరికా, యూకేకు వెంటనే తప్పుడు సమాచారాన్ని పంపడం కూడా అందుకు నిదర్శనం. ఈ కవ్వింపు చర్య ద్వారా ఉక్రెయిన్ గగన తలాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించేలా నాటోపై ఒత్తిడి తేవాలని ప్రయత్నించారు" అంటూ అజరోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.