రష్యా మరింత దూకుడు పెంచిన క్రమంలో అప్రమత్తమైంది ఉక్రెయిన్. ఇప్పటికే.. దేశంలోని రిజర్వ్ భద్రతాబలగాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా నుంచి ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైంది. దేశంలో ఎమర్జెన్సీ విధించే ప్రణాళికకు ఉక్రెయిన్ భద్రతా మండలి ఆమోదం తెలిపింది.
దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు మినహా ఉక్రెయిన్ మొత్తం అత్యవసర పరిస్థితి విధించనున్నట్లు ఆదేశ భద్రతా విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని, అవసరమైతే మరో 30 రోజులు పొడగించొచ్చని చెప్పారు.
రష్యాపై మరిన్ని దేశాల ఆంక్షలు..
ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేరాయి. దౌత్యపరంగా చర్చల ద్వారా సమస్య పరష్కారానికి రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
జపాన్ ఆంక్షలు..
రష్యాతో పాటు స్వతంత్ర ప్రాంతాలుగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుర్తించిన ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలే లక్ష్యంగా ఆంక్షలు విధించారు జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేపడుతున్న చర్యలకు ప్రతిస్పందనగా.. రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, పంపిణీని జపాన్‌లో నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని రెండు రెబల్ ప్రాంతాలకు సంబంధించిన వారికి వీసాల జారీని సైతం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతాలతో వాణిజ్యాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తున్న రష్యా తీరును ఖండిస్తున్నట్లు ఉద్ఘాటించారు.
ఆర్థిక ఆంక్షలు..
రష్యా భద్రతా మండలికి చెందిన 8 మంది సభ్యుల ప్రయాణాలపై నిషేధంతో పాటు ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి. దీని ద్వారా రోసియా బ్యాంక్, ప్రోమ్స్వ్యాజ్ బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జెన్బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్ ఫర్ డెవలప్మెంట్, రీకన్స్ట్రక్షన్లతో ఆస్ట్రేలియా వ్యక్తులు, సంస్థలు వ్యాపార లావాదేవీలు జరపలేవని స్పష్టం చేశారు.
రష్యాపై ఆంక్షలు స్వాగతిస్తున్నాం: పోలాండ్
రష్యా నుంచి వచ్చే గ్యాస్ పైప్‌లైన్ నార్డ్ స్ట్రీమ్ 2 పనులను నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించటాన్ని స్వాగతించారు పోలాండ్ నేతలు. ఉక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును హానికరమైన, ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ ప్రాజెక్టుగా అభివర్ణించారు పోలిష్ ప్రధాని మాట్యూస్జ్ మొరావికీ.