తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై భీకర దాడులు.. ప్రపంచ దేశాలకు రష్యా వార్నింగ్​

Ukraine Russia war: ఉక్రెయిన్​-రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖర్కివ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌ నుంచి పౌరుల సురక్షిత తరలింపునకు వీలుగా దాడి నుంచి మేరియుపొల్‌, వోల్నొవాఖ నగరాల్లో కాస్త విరామం ఇస్తామని చెప్పిన రష్యా.. మాట తప్పింది. మరోవైపు నో ఫ్లై జోన్‌ ప్రకటిస్తే యుద్ధంలో పాల్గొన్నట్లే పరిగణిస్తామని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది.

Ukraine Crisis
Ukraine Crisis

By

Published : Mar 6, 2022, 7:09 AM IST

Ukraine Russia war: ఉక్రెయిన్‌ యుద్ధంలో శనివారం 10వ రోజూ విధ్వంసం కొనసాగింది. ఉక్రెయిన్‌ నుంచి పౌరుల సురక్షిత తరలింపునకు వీలుగా దాడి నుంచి మేరియుపొల్‌, వోల్నొవాఖ నగరాల్లో కాస్త విరామం ఇస్తామని చెప్పిన రష్యా.. అలా చేసినట్లే చేసి, వాటిలో కొన్ని ప్రాంతాలతో సహా ఇతర నగరాలపై దాడులు యథావిధిగా కొనసాగించింది. క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడి నుంచి ఉక్రెయిన్‌కు కాసేపు ఊరట లభించినట్లు కనిపించినా అంతలోనే రష్యా మరోసారి విరుచుకుపడి ఆ ఆశల్ని అడియాస చేసింది. తెల్లవారుజామునే ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖర్కివ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. కాస్త విరామం అంటే ఎన్నాళ్లు అనేది రష్యా స్పష్టం చేయలేదు. సురక్షితంగా నగరాన్ని దాటించేందుకు వేలమంది ప్రజల్ని బస్సుల్లో సిద్ధం చేసినా, బాంబుల మోత ఆగకపోవడంతో తరలింపు ప్రక్రియను నిలిపివేసినట్లు మేరియుపొల్‌ మేయర్‌ ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గుడ్లురిమారు. ఏ దేశమైనా ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌ (నిషిద్ధ గగనతలం)గా ప్రకటిస్తే ఆ దేశం కూడా అక్కడి యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ గగనతలం మీదుగా ప్రయాణించకుండా ఆంక్షలు విధించాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలిదిమిర్‌ జెలెన్‌స్కీ గట్టిగా పట్టుపడుతున్న నేపథ్యంలో రష్యా తీవ్ర పదజాలంతో శనివారం స్పందించింది.

.

ఉక్రెయిన్‌ వంచిస్తోంది: రష్యా

తరలింపు ప్రక్రియలో వంచనకు ఉక్రెయిన్‌ పాల్పడుతోందని పుతిన్‌ ఆరోపించారు. దేశ ఉనికినే ఉక్రెయిన్‌ ప్రశ్నార్థకం చేసుకుంటోందని, అది జరిగితే దానికి పూర్తిగా ఆ దేశానిదే బాధ్యత అవుతుందని చెప్పారు. రష్యాలో ప్రస్తుత తరుణంలో మార్షల్‌ లా విధించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఏదైనా దేశంపై వెలుపలి శక్తులు దురాక్రమణకు దిగినప్పుడు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు మార్షల్‌ లా విధిస్తారు. అలాంటి పరిస్థితి మాకు లేదు. అలాంటిది వస్తుందని అనుకోవడం లేదు’’ అని స్పష్టంచేశారు. నో ఫ్లై జోన్‌ను ప్రకటించడానికి నాటో నిరాకరిస్తోందంటూ జెలెన్‌స్కీ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. విదేశీయుల సురక్షిత తరలింపు సహా అన్ని అంశాలపై మూడో విడత చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లవ్రోవ్‌ చెప్పారు.

.

మేరియుపొల్‌పై మరిన్ని ఆయుధాలు

ఉక్రెయిన్‌కు సముద్రంతో సంబంధాలు తెగిపోయేలా మేరియుపొల్‌ను దిగ్బంధం చేయడానికి రష్యా మరిన్ని ఆయుధాలను ప్రయోగించింది. ఇప్పటికే గుప్పిట పెట్టుకున్న నగరాల్లో రష్యాకు ప్రతిఘటన ఎదురవుతోంది. రష్యాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసి, దాని పైలట్‌ను బందీగా పట్టుకున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. కో పైలట్‌ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వార్తల్ని నివేదించడంపై రష్యా ఆంక్షల నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ వార్తాసంస్థలు రష్యాలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లను రష్యా స్తంభింపజేసింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న లక్షల మంది ప్రజలకు వెంటనే ఆహారం అవసరం ఉందని ఐరాసలోని ప్రపంచ ఆహార కార్యక్రమ విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఐరాస భద్రత మండలి సోమవారం సమావేశం కానుంది. తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 8 నుంచి నిలిపివేయనున్నట్లు రష్యాకు చెందిన ఏరోఫ్లోట్‌ సంస్థ ప్రకటించింది. ఒక్క బెలారస్‌కు మాత్రం విమానాలు తిరుగుతాయని తెలిపింది. మరోవైపు- చెర్నిహైవ్‌ ప్రాంతంలో భవనాల శిథిలాల నుంచి 22 మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇప్పటివరకు 10 వేల మంది రష్యా సైనికులు మృతి!

యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మందికి పైగా రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొంది. రష్యాకు చెందిన 269 ట్యాంకులు, 945 సాయుధ పోరాట వాహనాలు, 39 యుద్ధ విమానాలు, 40 హెలికాప్టర్లు సహా అనేకం ధ్వంసం చేసినట్లు తెలిపింది. 409 మోటారు వాహనాలు, రెండు తేలికపాటి స్పీడ్‌ బోట్లు, మూడు యూఏవీలను నాశనం చేసినట్లు చెప్పింది. ఉక్రెయిన్‌ పౌరులతో పాటు విదేశాల్లో ఉంటున్న ఉక్రెయిన్‌ వాసులు సైతం స్వదేశానికి చేరుకుని సైన్యానికి అండగా ఉంటున్నారు. రష్యాపై పోరాడేందుకు సుమారు 66,224 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు రక్షణశాఖ ప్రకటించింది.

అణు కేంద్రాల భద్రతకు చర్యలు: ఫ్రాన్స్‌

ఉక్రెయిన్‌లోని అయిదు ప్రధాన అణు కేంద్రాల భద్రత కోసం త్వరలో సిఫార్సులు చేయనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ కార్యాలయం తెలిపింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రమాణాల ఆధారంగా భద్రతా చర్యలు రూపొందిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులతో సహా విదేశీ పౌరులను తరలించేందుకు తమ దేశ బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రష్యా తెలిపింది.

ఇదీ చూడండి:'జపోరిజియాపై దాడికి జెలెన్‌స్కీయే కారణం'

ABOUT THE AUTHOR

...view details