తెలంగాణ

telangana

ETV Bharat / international

'రష్యాతో సంబంధాలు కొనసాగించండి.. లేకుంటే మీకే నష్టం!' - ఉక్రెయిన్​పై రష్యా దాడులు

Russia Ukraine war
రష్యాపై దాడులు

By

Published : Mar 4, 2022, 6:48 AM IST

Updated : Mar 4, 2022, 11:54 PM IST

23:52 March 04

స్మార్ట్​ఫోన్లు, కార్లపై యుద్ధం ఎఫెక్ట్!

రష్యా-ఉక్రెయిన్​ మధ్య కొనసాగుతున్న భీరక పోరు ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచం ఈ యుద్ధంతో మళ్లీ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ముడి చమురు ధరలు గరిష్ఠస్థాయికి చేరాయి. ఎలక్ట్రానిక్​ వస్తువులు ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీ కండక్టర్ల తయారీకి కీలకమైన నియాన్​, పల్లాడియం ఉత్పత్తిలో సింహభాగం ఈ రెండు దేశాల నుంచే ఎగుమతి అవుతుండటం ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

సంబంధాలు కొనసాగించండి..

రష్యాతో యథావిధిగా సంబంధాలు కొనసాగించాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఆంక్షలు విధించటం వల్ల తామే లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేనందున ఉద్రిక్తతలు పెంచే చర్యలతోపాటు ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదన్నారు. తమ బాధ్యతలను తాము నిర్వహిస్తామని పుతిన్‌ పేర్కొన్నారు. రష్యా-టర్కీ సంయుక్తంగా నిర్మించిన కొత్త నౌక ప్రారంభోత్సవం సందర్భంగా పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు సహకరించకూడదని ఎవరైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది వారికి కూడా నష్టం చేస్తుందని పుతిన్‌ స్పష్టం చేశారు.

18:54 March 04

ఉక్రెయిన్‌ విడిచి పోలాండ్‌కు వెళ్లిన జెలెన్‌స్కీ: రష్యా మీడియా

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆ దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. ఆయన పోలాండ్‌కు వెళ్లిన రష్యా మీడియా తెలిపింది.

18:16 March 04

పుతిన్‌కు మద్దతుగా నిలవండి.. రష్యన్‌లకు క్రెమ్లిన్‌ పిలుపు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో.. రష్యన్లందరూ ఏకమై తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా నిలవాలని క్రెమ్లిన్ శుక్రవారం పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఇరుపక్షాల చర్చలపై ఉక్రెయిన్‌ స్పందన ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిది దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌తో ఇంకా ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని, అయితే యుద్ధానికి పరిష్కారంగా దేన్ని భావిస్తున్నామో ఆ దేశ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు.

17:55 March 04

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకరపోరు ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచం..ఈ యుద్ధంతో మళ్లీ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. అటు ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీకండక్టర్ల తయారీకి కీలకమైన నియాన్‌, పల్లాడియం ఉత్పత్తిలో సింహభాగం రష్యా, ఉక్రెయిన్‌ నుంచే ఎగుమతి అవుతుండటం ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

17:25 March 04

రొమేనియా 5,245 మంది భారత్​కు..

మార్చి 3వ తేదీ నుంచి ఇప్పటివరకు 5,245 మంది భారతీయులు రొమేనియా నుంచి భారత్​కు వచ్చనట్లు కేంద్రం తెలిపింది.

17:01 March 04

రష్యా దాడిలో 160 విద్యా సంస్థలు విధ్వంసం

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరులో సుమారు 160 విద్యా సంస్థలు దాడికి గురైనట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. రష్యాన్​ సేనలు జరిపిన కాల్పుల్లో ఆ విద్యా సంస్థలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ధ్వంసం అయినట్లు ఆ దేశాంగ శాఖ ప్రతినిధి ట్వీట్​ చేశారు.

15:51 March 04

సరైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: ఐఏఈఏ

ఉక్రెయిన్‌లోని జాపోరిషియా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో రష్యా చేపట్టిన దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ అణు విద్యుత్తు సంస్థ(ఐఏఈఏ) ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. న్యూక్లియర్‌ ప్లాంట్‌ భద్రత ప్రమాదంలో పడిన నేపథ్యంలో.. సరైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. త్వరలో ప్లాంట్‌ను సందర్శించనున్నట్లు.. ఈ మేరకు ఉక్రెయిన్‌, రష్యాలకు సమాచారం అందించానని ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ మారియానో గ్రోసి తెలిపారు. అయితే, దాడులతో అక్కడి ఆరు అణు రియాక్టర్లపై ఎటువంటి ప్రభావం పడలేదని వెల్లడించారు.

14:04 March 04

జపోరిజ్జియా అణు కేంద్రం.. ఉక్రెయిన్‌ సైన్యానికి దెబ్బ!

జపోరిజ్జియా అణు విద్యుత్తు కేంద్రాన్ని రష్యా బలగాల నుంచి కాపాడుకునే క్రమంలో పలువురు ఉక్రెయిన్‌ సైనికులు మృతి చెందినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. కొందరికి గాయాలయినట్లు తెలిపాయి. అయితే, ఈ సంఖ్యపై స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్‌ను రష్యన్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు.

14:03 March 04

ఆర్మీపై ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తే జైలుకే..!

తమ సాయుధ బలగాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని జైలు శిక్ష విధించదగిన నేరంగా పరిగణించే చట్టాన్ని రష్యా పార్లమెంటు దిగువ సభ శుక్రవారం ఆమోదించింది. దీని ద్వారా సాయుధ దళాల గురించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారికి జరిమానాలు, 15 ఏళ్లవరకు జైలు శిక్ష విధించవచ్చు

14:03 March 04

ట్విట్టర్, ఫేస్‌బుక్‌పై రష్యా నిషేధం..

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక పోరులో ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఈ సైనిక చర్యను ఖండిస్తూ.. పలు దిగ్గజ సంస్థలు రష్యాలో వాటి ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పుడు రివర్స్‌లో రష్యా కూడా ఆ తరహా చర్యలే తీసుకుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్‌ స్టోర్‌ సేవల్ని బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ఓ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు ట్వీట్ చేశారు. సైనిక పోరు గురించి ఉక్రెయిన్‌, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

12:42 March 04

రష్యా అధీనంలోకి ఐరోపా అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం

ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రమైన జాపోరిజ్జియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ రష్యా అధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా సేనలు క్షిపణి దాడులకు పాల్పడటంతో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఈ అణు విద్యుత్‌ కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌లోనూ సోనూసూద్‌ సేవలు

కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఎందరికో సేవలందించిన ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ పేరు ఇపుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలోనూ వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత అజయ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వీడియోలో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఓ మహిళ రైలు ప్రయాణం (బహుశా.. ఉక్రెయిన్‌ సరిహద్దులో) చేస్తూ మాట్లాడిన దృశ్యాలు ఉన్నాయి. 'హలో.. నా పేరు సృష్టిసింగ్‌. మేమిక్కడ రైలు ఎక్కాక 'సోనూసూద్‌' బృందం మాకు మార్గదర్శకంగా ఉంటూ ఎంతో సాయం చేస్తోంది. నా చుట్టూ ఎంతమంది విద్యార్థులు కూర్చొన్నారో చూడండి. అందరూ భారతీయులే' అని ఆమె మాట్లాడారు.

రొమేనియాలోకి 1.67 లక్షల మంది ఉక్రెనియన్లు..

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు మొదటి ఎనిమిది రోజుల్లో 1.67 లక్షలకు పైగా ఉక్రెనియన్లు తమ దేశంలోని ప్రవేశించినట్లు రొమేనియా బార్డర్‌ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇక్కడి నాలుగు చెక్‌పోస్టులతోపాటు మాల్డోవా నుంచి వారు రొమేనియాకు చేరుకున్నట్లు చెప్పారు. మరోవైపు.. యుద్ధ క్షేత్రంగా మారిన ఉక్రెయిన్‌కు అంబులెన్స్‌ల రూపంలో సాయం అందజేస్తామని స్థానిక అధికారులు తెలిపారు.

11:21 March 04

ఉక్రెయిన్​ పరిణామాలపై మోదీ మరోసారి సమీక్ష..

ఉక్రెయిన్​ సంబంధిత పరిస్థితులు, తాజా పరిణామాలు, భారతీయుల తరలింపు ప్రక్రియ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులు ఎస్​ జైశంకర్​, పీయూష్​ గోయల్​, జాతీయ భద్రతా సలహాదారు ఎన్​ఎస్​ఏ అజిత్​ డోభాల్​ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం 'ఆపరేషన్​ గంగ' చేపట్టింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు నలుగురు మంత్రులను పంపించి.. భారత పౌరులను తరలిస్తోంది.

10:22 March 04

అణు కేంద్రానికి తప్పిన ముప్పు.. అదుపులోకి మంటలు

ఉక్రెయిన్​లోని అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగటం వల్ల ఆందోళన నెలకొంది. అయితే, జాతీయ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు చెప్పారు.

10:15 March 04

ఉక్రెయిన్​పై 480 మిసైల్స్​ ప్రయోగించిన రష్యా

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. ఉక్రెయిన్​ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంలో పురోగతి సాధించినప్పటికీ ఉత్తర ప్రాంతంలో ఆ దేశ సేనల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. మొత్తం మిసైల్స్​లో 230.. ఉక్రెయిన్​లోని మొబైల్స్​ వ్యవస్థల ద్వారా ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా భూభాగం నుంచి 150, బెలారస్​ నుంచి 70, నల్లసముద్రంలోని నౌకల ద్వారా కొన్నింటిని ప్రయోగించినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్​ క్షిపణి విధ్వంసక దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయని తెలిపింది.

09:03 March 04

అణు కేంద్రంపై రష్యా దాడి.. యూఎస్​, యూకే​ ఆందోళన

ఉక్రెయిన్​లోని అతిపెద్ద న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై రష్యన్​ సేనలు దాడులకు పాల్పడిన క్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ఫోన్​లో మాట్లాడినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది.

"ఈరోజు ఉదయం ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో యూకే ప్రధాని బోరిస్​ జాన్సన్​ మాట్లాడారు. అధ్యక్షుడు పుతిన్​ నిర్లక్ష్యపూరితమైన దాడులు ఇప్పుడు ఐరోపా మొత్తం భద్రతకు ముప్పుగా మారాయని.. పరిస్థితులు మరింత దుర్భలంగా మారకుండా ఉండేందుకు యూకే అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు."​

- యూకే ప్రభుత్వం.

జెలెన్​స్కీకి బైడెన్ ఫోన్​..

ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రమైన జపోరిజ్జియా ఎన్​పీపీపై రష్యా దాడులు చేసిన క్రమంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. న్యూక్లియర్​ ప్లాంట్​ సమీపంలో కాల్పుల విరమణ చేయాలని, అగ్నిమాపక దళాలు, అత్యవసర స్పందన దళాలను అనుమతించాలని రష్యాను కోరినట్లు శ్వేతసౌధం తెలిపింది.

మరోవైపు.. జెలెన్​స్కీతో కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో సైతం మాట్లాడారు. న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై దాడి చేసిన రష్యా చర్యలను ఖండించారు. ఆమోద యోగ్యంకాని ఇలాంటి దాడులను వెంటనే మానుకోవాలని రష్యాకు సూచించారు.

08:52 March 04

ఉక్రెయిన్​లోని భారతీయ విద్యార్థికి తూటా గాయం

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. ఆ దేశ రాజధాని కీవ్​లో జరిగిన ఘర్షణల్లో మరో భారతీయ విద్యార్థికి తూటా తగిలింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయాన్ని పౌర విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్​ వీకే సింగ్​.. పోలండ్​లోని విమానాశ్రయంలో మాట్లాడుతూ వెల్లడించారు.

"కీవ్​లో ఓ విద్యార్థికి తూటా తగిలినట్లు తెలిసింది. వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే కీవ్​ను వదలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. యుద్ధ సమయంలో ఏ ప్రాంతం, ఏ దేశం అనేవి కనిపించవు."

- వీకే సింగ్​, కేంద్ర మంత్రి.

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్​ను వదిలి పోలండ్​ సహా ఇతర సరిహద్దు దేశాలకు వెళ్తున్నారు భారత పౌరులు, విద్యార్థులు.

08:13 March 04

రష్యాకు అమెరికా అధ్యక్షుడి వినతి

ఉక్రెయిన్​లో జపోరిజ్జియా అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా సేనలు దాడులకు పాల్పడిన క్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. న్యూక్లియర్​ ప్లాంట్​లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అత్యవసర స్పందన దళాలు చేరుకునేందుకు అనుమతించాలని రష్యాను కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

మరోవైపు.. రష్యా దాడిలో జపోరిజ్జియా పవర్​ ప్లాంట్​లోని కీలకమైన సామగ్రికి ఎలాంటి హాని జరగలేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు తెలిపింది ఉక్రెయిన్​. ప్రమాదాన్ని తగ్గించే పనిలో ప్లాంట్​ అధికారులు నిమగ్నమైనట్లు తెలిపింది.

06:40 March 04

Russia Ukraine war: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం లైవ్​ అప్డేట్స్​

Ukraine crisis: ఉక్రెయిన్​పై వారం రోజులుగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది రష్యా. ఓవైపు చర్చలు జరుపుతూనే దాడులకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆంక్షలను ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. ఉక్రెయిన్​లోని పలు కీలక నగరాలను తమ స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు.. ఎనర్హోదర్ నగరంలో ఉన్న ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రంపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి కులేబా.

"ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రం జపోరిజియా ఎన్​పీపీపై రష్యన్​ ఆర్మీ దాడులకు పాల్పడింది. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అది పేలినట్లయితే.. చెర్నోబిల్ పేలుడు కంటే 10 రెట్లు భారీ నష్టం ఉంటుంది." అని ఉక్రెయిన్​ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ​

అణు విద్యుత్తు కేంద్రంపై దాడులకు సంబంధించిన వీడియోను.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ కార్యాలయం సలహాదారు ట్వీట్​ చేశారు.

హెచ్చరికలు..

ఒడేసా, బిలా సెర్​క్వా, వొలిన్​ ఒబ్లాస్ట్​ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని​ హెచ్చరికలు చేశారు అధికారులు. స్థానికులు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని తెలిపారు.

ఐఏఈఏ ఆందోళన..

ఉక్రెయిన్​లోని జపోరిజియా న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై రష్యా బలగాలు దాడి చేస్తున్నట్లు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) ట్వీట్​ చేసింది. ప్రస్తుత పరిస్థితులపై ఉక్రెయిన్​ అధికారులతో మాట్లాడినట్లు తెలిపింది.

" ఉక్రెయిన్​ ప్రధాని డెనిస్​ శ్యామగల్​, ఉక్రెయిన్​ అణు విద్యుత్తు నియంత్రణ, నిర్వహణ సంస్థతో ఐఏఈఏ డైరెక్టర్​ జనరల్​ రఫీల్​ మారియానోగ్రోసి మాట్లాడారు. అణు కేంద్రంపై దాడులను ఆపాలను కోరారు. రియాక్టర్​ పేలితే భారీ ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు."

- ఐఏఈఏ

Last Updated : Mar 4, 2022, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details