తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉక్రెయిన్​పై​ ఆగని దాడులు.. శాంతి చర్చలు ఫలించేనా? - రష్యా యుద్ధం

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌సహా ఇతర ప్రధాన నగరాల్లో రష్యా సేనలు పెద్దఎత్తున దాడులు చేస్తున్నాయి. ఫిరంగి దాడిలో సెంట్రల్‌ కీవ్‌లోని ఓ భవంతి 12వ అంతస్థులో మంటలు చెలరేగాయి. శాంతిచర్చల తీరుపై ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. మరోవైపు.. ఉక్రెయిన్​పై దాడులను వెంటనే ఆపాలని రష్యాను ఆదేశించింది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిని తమ విజయంగా పేర్కొన్నారు జెలెన్​స్కీ.

Russia Ukraine war 21th day
రష్యా ఉక్రెయిన్​ యుద్ధం

By

Published : Mar 16, 2022, 10:47 PM IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 21వ రోజు దాడులు మరింత ఉద్ధృతం చేసింది. రాజధాని కీవ్‌ శివారు ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. రష్యా సేనలు జరిపిన ఫిరంగి దాడిలో సెంట్రల్‌ కీవ్‌లోని ఓ అపార్ట్‌మెంటు 12వ అంతస్థులో మంటలు ఎగిసిపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పక్కనే ఉన్న పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నాయి. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు పేర్కొన్నాయి. పెద్దఎత్తున దాడులు చేసి రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకుగాను పుతిన్‌ సేనలు రాజధానికి దారితీసే రవాణామార్గాలను నాశనం చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఖార్కివ్‌లో మాస్కో బలగాలు జరిపిన షెల్లింగ్‌లో ఓ వ్యక్తి చనిపోవటంతో పాటు 2 అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒడెసా, నిప్రో, లివివ్, చెర్కసీ, ఇవానో-ఫ్రాంకివ్‌స్క్, విన్నిసియా, మైకోలవ్, పోల్టావా నగరాల్లో వైమానిక దాడులను అలర్ట్‌ చేసే సైరన్లు మోగినట్లు ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది

ఉక్రెయిన్‌-రష్యా మధ్య మంగళవారం మొదలైన మూడోవిడత చర్చలు రెండోరోజుకు చేరాయి. తమ దేశ భద్రతకు ప్రపంచ దేశాల నుంచి హామీ కోరుకుంటున్నట్లు పేర్కొన్న ఉక్రెయిన్‌ ఆస్ట్రియా, స్వీడెన్‌ తరహా తటస్థహోదా చేపట్టాలన్న రష్యా ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య రాజీకుదిరే అవకాశం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. శాంతిచర్చల్లో మాస్కో డిమాండ్లు మరింత వాస్తవరూపకంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరోవైపు.. అమెరికా కాంగ్రెస్‌లో వర్చువల్‌గా ప్రసంగించిన ఆయనకు చట్టసభల సభ్యులు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. తక్షణ అమెరికా సాయం అవసరమని, ఆదాయం కన్నా శాంతి ముఖ్యమని సూచించారు. కీవ్‌లో మంగళవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిసి ఐరోపా దేశాల తరఫున సంఘీభావం తెలిపిన పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్లోవేకియా దేశాధినేతలు తిరిగి తమ దేశాలకు చేరుకున్నారు.

13వేలకుపైగా మాస్కో సైనికుల మృతి

ఓడరేవు పట్టణం మేరియుపోల్ సమీపంలో జరిగిన భీకరపోరులో రష్యాకు చెందిన నాలుగో మేజర్ జనరల్ చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు ఆయన మృతదేహంతో కూడిన ఫొటోను విడుదల చేసింది. రష్యాకు చెందిన రెండు SU-34సహా 3యుద్ధ విమానాలు, ఓ చాపర్‌ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 13,800 మంది సేనలను మాస్కో కోల్పోయినట్లు ప్రకటించింది. 430 యుద్ధట్యాంకులు, 1375 సాయుధ వాహనాలు, 84యుద్ధ విమానాలు, 108 హెలికాప్టర్లు, 11డ్రోన్లను తమ సైన్యం కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 103మంది చిన్నారులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు తెలిపాయి. 400లకుపైగా విద్యా సంస్థలపై రష్యా సేనలు జరిపిన దాడుల్లో 59 భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి. మేరియుపోల్ నుంచి ఇప్పటివరకు 20వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు పేర్కొన్న ఉక్రెయిన్​ మరో 2లక్షలమందిని అత్యవసరంగా తరలించాల్సి ఉందని వెల్లడించింది.

మరోవైపు మార్షల్‌ లా విధించవచ్చనే ఊహాగానాల మధ్య రష్యా ప్రజలు కూడా ఇతర దేశాలకు వెళ్తున్నారు. కొన్నివారాల నుంచి దాదాపు 25 వేల మంది రష్యన్లు జార్జియా, ఆర్మేనియా, టర్కీ, ఫిన్‌లాండ్‌, ఉజ్బేకిస్థాన్‌కు వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు

ఉక్రెయిన్‌పై మూడు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక ఆదేశాలు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసి.. ఆ దేశ భూభాగం నుంచి రష్యా తన భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఉక్రెయిన్‌ భూభాగంపై ఇక నుంచి రష్యా సేనలు గానీ, దానికి మద్దతిచ్చే సాయుధ బృందాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించింది.

అంతర్జాతీయ కోర్టులో పూర్తి విజయం సాధించాం: జెలెన్‌స్కీ

రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని ఉక్రెయన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దండయాత్రను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి ఇచ్చిన ఈ తీర్పునకు రష్యా కట్టుబడి ఉండాలన్నారు. దీన్ని విస్మరిస్తే రష్యా మరింత ఒంటరవుతుందని పేర్కొన్నారు.

రష్యా-అమెరికా మధ్య తొలిసారి ఉన్నతస్థాయి సంప్రదింపులు!

ఉక్రెయిన్‌, రష్యా మధ్య గత మూడు వారాలుగా భీకర దాడులు కొనసాగుతున్న వేళ బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి అమెరికా, రష్యా మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులు చోటుచేసుకున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులివాన్‌ బుధవారం రష్యా భద్రతా మండలి కార్యదర్శి జనరల్‌ నొకోలాయ్‌ పట్రుషెవ్‌తో మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడిచింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జాక్‌ పునరుద్ఘాటించారని పేర్కొంది. దౌత్యం గురించి రష్యా సీరియస్‌గా ఉంటే గనక తక్షణమే ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలపై దాడులు మానుకోవాలని సూచించినట్టు తెలిపింది.

ఆర్థిక మెరుపుదాడి విఫలం: పుతిన్​

ఉక్రెయిన్​పై ముందస్తు ప్రణాళిక ప్రకారం చేస్తున్న ఆపరేషన్​ విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖండించారు. ఆర్థిక, రాజకీయ, సమాచార మార్గాల ద్వారా యుద్ధంగా అభివర్ణించారు. రష్యాపై ఆర్థిక మెరుపుదాడిలో పశ్చిమ దేశాలు విఫలమైనట్లు చెప్పారు. ఆంక్షల ఫలితంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతున్నాయన్నారు. తమ దేశంపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చని, దీనిని ప్రతిఒక్కరు గుర్తించాలని సూచించారు. ఉక్రెయిన్​పై సైనిక చర్య ఆంక్షలు విధించేందుకు ఒక సాకు మాత్రమేనని చెప్పారు.

స్పుత్నిక్​ టీకా పరిశీలన వాయిదా: డబ్ల్యూహెచ్​ఓ

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వీ పరిశీలన వాయిదా వేసినట్లు తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం రష్యాలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు పేర్కొంది. ' స్పుత్నిక్​ వీ ఉత్పత్తి పరిశ్రమలోని వసతులను అంచనా వేసేందుకు మార్చి 7న ఐరాస అధికారులు రష్యాకు వెళ్లాల్సి ఉండేది. అయితే, ఆ తనిఖీలు మరో తేదీకి వాయిదా పడ్డాయి. వసతుల అంచనాలు, తనిఖీలపై ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. విమానాలు లేకపోవటం, క్రెడిట్​ కార్డుల సమస్యలు ఉన్నాయి.' అని డబ్ల్యూహెచ్​ఓ వ్యాక్సిన్​ నిపుణుడు డాక్టర్​ మారియాంజెలా సిమావ్​ తెలిపారు.

ఇదీ చూడండి:రసాయన దాడుల ముప్పు.. ఉక్రెయిన్​ ప్రజల్లో గుబులు!

దూకుడు పెంచిన రష్యా.. క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న కీవ్​

ABOUT THE AUTHOR

...view details