తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగో విడత శాంతి చర్చలు - ఉక్రెయిన్​పై బాంబుల వర్షం

Russia attack on Ukraine
రష్యా వ్యవహారంపై నేడు అమెరికా, చైనా భేటీ

By

Published : Mar 14, 2022, 6:56 AM IST

Updated : Mar 14, 2022, 4:28 PM IST

16:27 March 14

శాంతి చర్చలు..

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగో విడత శాంతి చర్చలు జరుగుతున్నాయి. కాల్పుల విరమణ సహా పలు కీలక అంశాలపై ఇరుదేశాల ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

12:53 March 14

ఉక్రెయిన్‌పై రాజ్యసభ, లోక్‌సభల్లో మంగళవారం ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ రేపు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్న భారత్‌.. రేపు ఉభయసభల్లో చేసే ప్రకటనపై ఆసక్తి నెలకొంది.

11:33 March 14

రష్యా మా నుంచి ఎలాంటి సాయం కోరలేదు: చైనా

ఉక్రెయిన్‌పై యుద్ధం సందర్భంగా రష్యా తమను ఎలాంటి సాయం కోరలేదని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సాయం కోరడం మేము వినలేదని రాయబార కార్యాలయం అధికారి లీ పెంగ్యూ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై పోరులో ముందుకెళ్లేందుకు ఇటీవల రష్యా.. చైనా సాయం కోరినట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది. దీనిపై లీ పెంగ్యూ స్పందించారు. "ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళన కరంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు చైనా ముందున్న ప్రథమ ప్రాధాన్యత" అని లీ చెప్పారు.

మేరియుపోల్‌పై రష్యా వరుస బాంబు దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ తీవ్రతను పెంచింది. తాజాగా ఈ ఉదయం మేరియుపోల్‌లోని భవనాలపై వరుస బాంబు దాడులకు పాల్పడింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. వరుస బాంబు దాడులతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

చెర్నోబిల్‌ నుంచి విద్యుత్తు పునరుద్ధరణ: ఉక్రెయిన్‌

రష్యా ఆక్రమణ వల్ల చెర్నోబిల్‌ అణువిద్యుత్తు ప్లాంట్‌ నుంచి ఉక్రెయిన్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు ఉక్రెయిన్‌ అణుశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్లాంట్‌లోని కూలింగ్‌ సిస్టమ్ సాధారణ స్థితిలోనే పని చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌ పోస్టు ద్వారా వెల్లడించింది.

10:48 March 14

వెంటనే ఉక్రెయిన్‌ను వీడండి: అమెరికా రాయబార కార్యాలయం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన నగరాలపై దాడులు చేస్తున్న రష్యా సేనలు వాటిని తమ ఆధీనంలోని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులు వెంటనే ఉక్రెయిన్‌ వీడాలని కీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మరోసారి ప్రకటించింది. రష్యా దాడులను ఊహించని రీతిలో భీకరంగా చేస్తోందని తెలిపింది. పౌరులు జాగ్రత్తగా సరిహద్దులు దాటాలని, క్షేమంగా ఉన్న మార్గాలను ఎంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ను వీడాలని అమెరికా గతంలోనూ సూచించిన విషయం తెలిసిందే.

07:20 March 14

'నో ఫ్లైజోన్​ ప్రకటించకుంటే నాటోలోకి రష్యా రాకెట్లు'

ఉక్రెయిన్​ పశ్చిమ ప్రాంతంలో రష్యా బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో తమ దేశంపై నో ఫ్లైజోన్​ ప్రకటించాలని నార్త్​ అట్లాంటిక్​ ట్రీటీ ఆర్గనైజేషన్​(నాటో)కు మరోమారు విజ్ఞప్తి చేశారు జెలెన్​స్కీ. లేకపోతే రష్యా రాకెట్లు నాటో భూభాంగపైనా పడతాయన్నారు. రష్యాను నిలవరించకుంటే.. పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగుతుందని, నార్డ్​ స్ట్రీమ్​2ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఐరాపా సమాఖ్యలో ఉక్రెయిన్​ సభ్యత్వంపై చర్చల ప్రక్రియకు ప్రాధాన్యమిస్తామని ఈయూ కౌన్సిల్​ అధ్యక్షుడు చార్లెస్​ మైకెల్​ చెప్పినట్లు తెలిపారు జెలెన్​స్కీ. ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. ఉక్రెయిన్​కు ఆర్థిక సాయం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.

07:08 March 14

రష్యా- ఉక్రెయిన్​ మధ్య నేడు మరోవిడత శాంతి చర్చలు

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో మరోమారు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. సోమవారం ఉదయం 10.30 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు చేపట్టనున్నట్లు స్పుత్నిక్​ మీడియా తెలిపింది. మరోవైపు.. ఈ చర్చలు జరుగుతున్నట్లు ఉక్రెయిన్​ ప్రతినిధులు సైతం ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

06:42 March 14

Russia Ukraine war: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం లైవ్​ అప్డేట్స్​

Russia Ukraine war: ఉక్రెయిన్​పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా, చైనా సోమవారం రోమ్​లో భేటీ కానున్నాయి. యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆ దేశంపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు వంటి అంశాలు దీనిలో చర్చకు రానున్నాయి. అమెరికా తరఫున జాతీయ భద్రతా సలహాదారుడు జాక్​ సులివన్​, చైనా నుంచి విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్​ జీటీ దీనికి హాజరుకానున్నారు.

మారుతున్న యుద్ధ తంత్రం

ఉక్రెయిన్‌ను అష్టదిగ్బంధం చేసి ముప్పేట దాడి చేస్తున్న రష్యా సేనలు.. పరిస్ధితులకు అనుగుణంగా యుద్ధ తంత్రాన్ని మారుస్తున్నాయి. ఇప్పటిక వరకు రాజధాని కీవ్‌ సహా కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా దాడులు చేస్తున్న రష్యా తాజాగా దాని పొరుగు దేశాలకు హెచ్చరికలు పంపే లక్ష్యంతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌కు ఆయుధాల పరంగా సాయం చేసే దేశాలు కూడా తమ లక్ష్యమే అని రష్యా ఇప్పటికే హెచ్చరించింది. ఆదివారం ఆ దిశగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

నాటోలో సభ్యత్వం కోసం యత్నించవద్దని ఉక్రెయిన్‌ను హెచ్చరిస్తున్న రష్యా దానిలో సభ్యదేశమైన పోలండ్‌కు సమీపంలో బీభత్సం సృష్టించింది. పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందడంలో పోలండ్‌ కీలక దేశంగా ఉంది. పోలండ్‌కు సమీపంలోని లివీవ్ నగరంలోని యురోపియన్‌ అంతర్జాతీయ శాంతి పరిరక్షక, భద్రత కేంద్రంపై రష్యా సేనలు వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘటనలో 35 మంది చనిపోగా, మరో 134 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న నాటో కూటమి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే రష్యా ఈ దాడి జరిపినట్లు భావిస్తున్నారు.

Last Updated : Mar 14, 2022, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details