FALSE FLAG operation Russia: తన మీద తానే దాడి చేసుకుని, అది ప్రత్యర్థి చేసిన పనిగా బుకాయిస్తూ యుద్ధానికి దిగడం చిరకాల పోరాట వ్యూహం. ఇలా మభ్యపెట్టే కార్యకలాపాలను సైనిక పరిభాషలో 'ఫాల్స్ ఫ్లాగ్' దాడి అంటారు. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి రష్యా సరిగ్గా ఇలాంటి ఎత్తుగడనే అనుసరించనున్నదని అమెరికా, బ్రిటన్ అనుమానిస్తున్నాయి. ఫాల్స్ ఫ్లాగ్ అనేది 16వ శతాబ్దిలో సముద్రపు దొంగల మోసపూరిత కార్యకలాపాల నుంచి పుట్టుకొచ్చింది. అప్పట్లో వాణిజ్య నౌకలను బురిడీ కొట్టించడానికి సముద్రపు దొంగలు తమ నౌకలపై మిత్రదేశ జెండాలను ఎగురవేసేవారు. వాటిని చూసి వాణిజ్య నౌకలు ఆ నౌకలను దగ్గరకు రానిచ్చేవి. తీరా సమీపంలోకి వచ్చాక జెండాలు దించేసి సొంత జెండాలతో దొంగలు వాణిజ్య నౌకలపైకి ఉరికి సరకు దోపిడీ చేసేవారు. తరవాత ఇలాంటి ఫాల్స్ ఫ్లాగ్ ఎత్తుగడతో దేశాలు యుద్ధానికి దిగిన ఘటనలు చరిత్రలో అనేకం.
రష్యా-స్వీడన్ యుద్ధం
FALSE FLAG Russia Sweden war:ఆధునిక కాలంలో మొదటిసారి ఫాల్స్ ఫ్లాగ్ దాడిని నిర్వహించిన దేశంగా స్వీడన్‌ను చెప్పాలి. పూర్వ రష్యా-స్వీడన్ సరిహద్దు రేఖ వద్ద పూమల అనే స్వీడిష్ గస్తీ కేంద్రం ఉండేది. 1788లో కొందరు స్వీడిష్ సైనికులు రష్యా సైనికుల యూనిఫారాలు ధరించి తమ గస్తీ కేంద్రంపై తామే దాడిచేశారు. అప్పటివరకు రష్యాతో యుద్ధానికి అంగీకరించని స్వీడిష్ పార్లమెంటు.. పూమల ఘటనతో ఎదురుదాడికి సమ్మతించింది. స్వీడన్ రాజు మూడవ గుస్తావ్‌కు యుద్ధ ప్రకటన చేసే అధికారం లేనందున పార్లమెంటు సమ్మతి తప్పనిసరి. అది లభించిన వెంటనే రాజు రష్యాపై యుద్ధం ప్రారంభించారు. అది రెండేళ్లపాటు సాగింది.
రెండవ జపాన్-చైనా యుద్ధం
Japan China False Flag operation:చైనా భూభాగంలో తమ అధీనంలోని ముక్డెన్ ప్రాంతంలో ఒక రైల్వే లైనుపై జపాన్ సైన్యం స్వయంగా బాంబు పెట్టింది. ఈ పేలుడు వల్ల పెద్దగా నష్టం జరగలేదు. రైళ్ల రాకపోకలు యథాతథంగా సాగాయి. అయినా పేలుడును సాకుగా చూపి జపాన్ సైన్యం 1931 సెప్టెంబరులో మంచూరియాపై దండెత్తి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. తరవాత దాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించింది.
గ్లైవిట్స్ ఘటన
జర్మనీ 1939లో పోలండ్‌పై దండెత్తడానికి ముందురోజు రాత్రి ఏడుగురు జర్మన్ సైనికులు పోలిష్ సైనికులుగా నటిస్తూ సరిహద్దుకు దగ్గర్లో జర్మన్ భూభాగంలోని గ్లైవిట్స్ రేడియో కేంద్రాన్ని ఆక్రమించారు. ఈ కేంద్రం ఇప్పుడు పోలండ్ చేతుల్లో ఉందంటూ సంక్షిప్త సందేశాన్ని ప్రసారం చేశారు. ఒక పౌరుని మృత దేహానికి పోలిష్ సైనిక దుస్తులు తొడిగి అక్కడ వదిలేశారు. దాడిలో అతడు మరణించినట్లు ప్రపంచాన్ని నమ్మించడానికి ఆ ఎత్తు వేశారు. మరుసటి రోజు గ్లైవిట్స్‌తో పాటు అటువంటి ఇతర ఘటనలను సాకుగా చూపి పోలండ్‌పై అడాల్ఫ్ హిట్లర్ దండయాత్ర ప్రారంభించారు.
రష్యా-ఫిన్లాండ్ యుద్ధం
జర్మనీ ఫాల్స్ ఫ్లాగ్ ఎత్తుగడతో 1939లో పోలండ్‌పై దాడి చేయగా సోవియట్ యూనియన్ అదే సంవత్సరం అదే చిట్కాను ఫిన్లాండ్‌పై దండెత్తడానికి ఉపయోగించింది. అప్పట్లో రెండు దేశాల సరిహద్దు రేఖకు సమీపంలో రష్యా భూభాగంలోని మైనిలా గ్రామంపై గుళ్ల వర్షం కురిసింది. ఇది ఫిన్లాండ్ సైన్యం చేసిన పని కాదనీ, సోవియట్ ఆంతరంగిక భద్రతా సంస్థ ఎన్.కె.వి.డి. ఏజెంట్లు ఫిన్లాండ్ సైనికుల ముసుగులో దాడి చేశారని తేలింది. సోవియట్, ఫిన్లాండ్‌ల మధ్య దురాక్రమణ నిరోధ ఒప్పందం ఉన్నా, ఫాల్స్ ఫ్లాగ్ దాడిని అడ్డుపెట్టుకుని ఫిన్లాండ్‌తో సోవియట్ యూనియన్ శీతాకాల యుద్ధం ప్రారంభించింది. ఇది పూర్తిగా సోవియట్ జరిపిన దురాక్రమణ యుద్ధమని 1994లో రష్యన్ సమాఖ్య తొలి అధ్యక్షుడు బోరిస్ యెల్‌త్సిన్ ఒప్పుకున్నారు.