తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా సరికొత్త అస్త్రం.. సామాన్య పౌరులకు ముప్పు తిప్పలు! - రష్యా ఉక్రెయిన్ తాజా వార్తలు

Ukraine Crisis Latest News: ఉక్రెయిన్​ను ఎలాగైనా వశం చేసుకోవాలని రష్యా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్​లోని సామాన్య పౌరులకు అందుతున్న సహాయక చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి రష్యా సేనలు. సహాయక సామగ్రి కాన్వాయ్‌పైనా రష్యా దాడులు చేస్తోంది.

Russian forces
రష్యా సేనలు

By

Published : Mar 13, 2022, 12:22 PM IST

Ukraine Crisis Latest News: ఉక్రెయిన్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న రష్యన్‌ సేనలు.. వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌ శివార్లలో భారీగా మోహరించిన బలగాలు మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగానూ పలు నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయా నగరాల్ని వీలైనంత త్వరగా గుప్పిట పట్టేందుకు రష్యన్‌ సేనలు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. సామాన్య పౌరులకు అందుతున్న సహాయక చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి. సైనిక సామగ్రి సరఫరాపైనా అస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి.

అంత్యక్రియలకూ అవకాశం లేదు..

శనివారం దాదాపు 4.30లక్షల మంది జనాభా ఉన్న మరియోపోల్‌కు అందుతున్న సాయాన్ని రష్యన్‌ సేనలు అడ్డుకున్నాయి. ఆహారం, మంచినీరు, ఔషధాల వంటి సామగ్రితో వెళుతున్న ట్రక్కులపైనా దాడులు జరిగాయి. అలాగే నగరాన్ని వీడి వెళుతున్న పౌరులనూ అడ్డుకుంటుండడం గమనార్హం. కీవ్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న కొంతమందిపై రష్యన్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా 7 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డట్లు వెల్లడించాయి. మరియోపోల్‌లో ఇప్పటి వరకు 1,500 మంది మరణించినట్లు ఆ నగర మేయర్‌ కార్యాలయం ప్రకటించింది. చివరకు మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉండడం లేదని స్థానికులు వాపోయారు.

విదేశీ సైనిక సామగ్రి సరఫరాపై దాడి చేస్తాం..

కాల్పుల విరమణ నిమిత్తం శనివారం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు సైనిక సామగ్రి కోసం 200 మిలియన్‌ డాలర్లు సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే, తమ సేనలు విదేశీ సైనిక సరఫరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని రష్యన్‌ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు.

లొంగిపోయే హక్కు మనకు లేదు.. జెలెన్‌స్కీ

మరోసారి వీడియో సందేశంలో మాట్లాడిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమెర్‌ జెలెన్‌స్కీ.. తమ దేశాన్ని ముక్కలుగా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా కొన్ని నగరాల్లో సూడో రిపబ్లికన్ల ముసుగులో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తోందన్నారు. లుహాన్క్స్‌, దొనెట్స్క్‌ తరహాలో నిరసనలను శ్రీకారం చుడుతోందన్నారు. అలాగే మరియోపోల్‌ నగర మేయర్ అపహరణతో ఓ కొత్త రకం ఉగ్రవాదానికి తెరతీస్తోందని ఆరోపించారు. వీటన్నింటినీ ఉక్రెయిన్‌ సమర్థంగా ఎదురొడ్డి నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రవేశించిన యుద్ధ యంత్రాన్ని ముక్కలు చేసేందుకు తమకు మరింత సమయం, బలం కావాలని వ్యాఖ్యానించారు. పౌరులు తమ ప్రతిఘటనను కొనసాగించాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే హక్కు లేదన్నారు. ఎంత కష్టమైనా పోరాడాలంటూ ఉక్రెయిన్‌ ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 1,300 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించినట్లు తెలిపారు.

మరోవైపు మరియోపోల్‌ పోర్టు ముట్టడికి రష్యన్‌ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. అందులో భాగంగా నగర తూర్పు ప్రాంతంపై ఇప్పటికే పట్టు సాధించాయని పేర్కొంది. ఆసుపత్రి సిబ్బంది ఉన్న ఓ తొమ్మిది అంతస్తుల భవనంపై రష్యన్‌ సేనలు కాల్పులు జరిపినట్లు తెలిపింది.

నల్లసముద్రంలో నౌకలకు అడ్డంకులు కల్పించొద్దు

Ukraine Crisis Black Sea: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడి నల్లసముద్రం, అజోవ్‌ సాగర తీరాల్లో చిక్కుకున్న వాణిజ్య నౌకలు తరలిపోయేందుకు సేఫ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (ఐఎంవో) పిలుపునిచ్చింది. ఐరాసకు చెందిన ఈ విభాగం అంతర్జాతీయ సముద్రయానం, సముద్ర చట్టాలను పర్యవేక్షిస్తుంది. నల్లసముద్ర తీరంలో పేలుళ్లు రెండు రవాణా నౌకలను తాకడంతో శనివారం సమావేశమైంది. వాణిజ్య నౌకలపై రష్యా దాడులను ఖండించింది. నావికుల భద్రత, సంక్షేమంతో పాటు సముద్ర పర్యావరణానికీ ఇవి హాని చేస్తాయని హెచ్చరించింది. ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 579 మంది పౌరులు మృతిచెందగా, మరో 982 మంది తీవ్రంగా గాయపడినట్టు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. మృతుల్లో 42 మంది చిన్నారులు ఉన్నట్టు వివరించింది.

రూ.4,437 కోట్ల విలువైన నౌక స్వాధీనం

ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేలా రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు ఇటలీ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ట్రియెస్టే నౌకాశ్రయంలో ఉన్న రష్యా సూపర్‌యాచ్‌ను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన ఈ నౌక విలువ సుమారు రూ.4,437 కోట్లు (578 మిలియన్‌ డాలర్లు)! బొగ్గు, ఎరువుల ఉత్పత్తిలో పేరుగాంచిన రష్యా వాణిజ్యవేత్త ఆండ్రీ ఇగోరెవిచ్‌ మెల్నిచెంకోకు చెందిన సూపర్‌యాచ్‌ 'సే ఏ'గా దీన్ని పోలీసులు గుర్తించారు.

గతవారం కూడా పలువురు రష్యా కుబేరులకు చెందిన విలాసవంత పడవలను, విల్లాలను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి:

ఉచ్చుబిగుస్తున్నా వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్​​ మేయర్​ కిడ్నాప్​

పోరాటంలో ప్రపంచం అతని కోసం ప్రార్థిస్తోంది!

ఉక్రెయిన్​ యుద్ధంలో రసాయన, జీవ 'ఆయుధ' రగడ

ABOUT THE AUTHOR

...view details