Russia Ukraine Conflict: సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ 1991 డిసెంబరు 1న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఐరోపాలో విస్తీర్ణం ప్రకారం రష్యా తర్వాత రెండో అతిపెద్ద దేశం ఉక్రెయిన్. జనాభాపరంగా ఎనిమిదవది. 8.13 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో 17.3 శాతం మంది రష్యన్ జాతీయులే. సోవియట్ యూనియన్ పతనమయ్యాక రక్షణ, అణ్వస్త్ర, క్షిపణి పరిశ్రమలు, అపార ఖనిజ సంపద ఉక్రెయిన్‌లోనే ఉన్నందున రష్యా అది తన మిత్ర దేశంగా తన ఛత్రఛాయల్లో కొనసాగాలని కోరుకుంది. కానీ నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్ కోరుకోవడం.. రష్యాకు రుచించలేదు. ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో దళాలు తన సరిహద్దుల్లో తిష్ఠ వేస్తాయని రష్యా ఆందోళనలో పడింది. అందుకే ఉక్రెయిన్ అణ్వస్త్ర రహిత దేశంగా ఉండాలని.. నాటోలో చేరవద్దని ఆ దేశంపైనా, దానిని చేర్చుకోవద్దని అమెరికా, ఐరోపా దేశాలపైనా ఒత్తిడి తెస్తోంది.
Russia Ukraine Relations: ఎంత ఒత్తిడి చేసినా ఉక్రెయిన్ దారికి రాని కారణంగా.. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకుని తనలో విలీనం చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఐరోపా దేశం.. మరో దేశ భూభాగాన్ని ఆక్రమించుకొని కలుపుకోవడం ఇదే ప్రథమం. సెవొస్తోపోల్ ప్రాంతంలోనూ రష్యా అనుకూల ప్రభుత్వం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ రక్షణ కోసమంటూ అక్కడ సేనలను దించాయి. ఉక్రెయిన్- రష్యా వివాదంలో అతి కీలకమైనది గ్యాస్ పైపులైన్ సమస్య. రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్, పెట్రోలు సరఫరా చేయాలంటే ఉక్రెయిన్ భూభాగం మీదుగా వేసిన పైపులైన్లే ఆధారం. ఇందుకోసం ఉక్రెయిన్‌కు రష్యా ఏటా మిలియన్ల డాలర్లు రాయల్టీగా చెల్లిస్తోంది. అయితే ఉక్రెయిన్ పాలకులు తరచూ ఈ పైపులైన్లను స్తంభింపజేస్తామని బెదిరిస్తుండగా.. రష్యా ప్రత్యామ్నాయం ఆలోచించింది. బాల్టిక్ సముద్రగర్భం గుండా పైపులైన్ల నిర్మాణం చేపట్టింది. జర్మనీ వరకు పూర్తి చేసింది కూడా. ఫ్రాన్స్‌కు కూడా దీని ద్వారా ఇంధన సరఫరా చేస్తానని ప్రతిపాదించింది.
అమెరికా, బ్రిటన్‌లో ఆందోళన..
ఐరోపాలో రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే జర్మనీయే దానితో గ్యాస్ సరఫరాపై ఒప్పందం కుదుర్చుకోవడం, ఫ్రాన్స్ కూడా సుముఖంగా ఉండడం వల్ల అమెరికా, బిట్రన్‌లో ఆందోళన మొదలైంది. దీనికితోడు జర్మనీ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ అచిమ్ స్కోన్‌బాచ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పుతిన్ మర్యాదస్తుడని.. ఆయన క్రిమియాను తిరిగివ్వరని.. ఉక్రెయిన్ ఏనాటికీ మళ్లీ పొందే అవకాశం లేదని ఇటీవల భారత పర్యటన సందర్భంగా స్కోన్‌బాచ్ అన్నారు. ఉక్రెయిన్‌ను తాము ఆక్రమించబోతున్నట్లు దుష్ప్రచారం చేస్తూ తమపై దాడి చేయాలని చూస్తున్నారని పుతిన్ విమర్శిస్తున్నారు.