Ukraine conflict: ఉక్రెయిన్లో మానవతా కార్యకలాపాలు చేపట్టేందుకు మంగళవారం ఉదయం 10 గంటల(రష్యా కాలమానం ప్రకారం) నుంచి ఐదు నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. రాజధాని కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్ నగరాల్లో కాల్పులకు విరామం పలికినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.
సోమవారం బెలారస్లో ఇరు దేశాల మధ్య మూడో విడత చర్చలు జరిగిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో పౌరుల తరలింపు సహా ఇతర కీలక అంశాలను ఇరు దేశాలు లేవనెత్తాయి. మంగళవారం నుంచి పౌరుల తరలింపునకు మానవతా కారిడార్ పనిచేస్తుందని ఉక్రెయిన్ తెలిపింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ప్రకటించినట్లు తేలుస్తోంది.
" 2022, మార్చి 8న ఉదయం 10 గంటల నుంచి మానవతా కారిడార్ ఏర్పాటు కోసం రష్యన్ ఫెడరేషన్ కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరుల తరలింపునకు కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్ నగరాల్లో కాల్పుల విరమణ ఉంటుంది. ఉదయం 3 గంటల లోపు పౌరుల తరలింపునకు అవలంభిస్తున్న విధానాన్ని ఉక్రెయిన్ తెలియజేయాలి. అలాగే రాతపూర్వక ఆమోదం, ఆయా మార్గాల్లో భద్రతకు హామీ ఇవ్వాలి."
- రష్యా విదేశాంగ శాఖ.
మార్చి 10న ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చర్చల్లో మరో కీలక అడుగు పడింది. మార్చి 10న ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భేటీ అవుతున్నట్లు ధ్రువీకరించారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా.
కీవ్లోనే ఉన్నా: జెలెన్స్కీ