ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ అభివృద్ధి చేసిన కరోనా ప్రయోగాత్మక వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ బ్రిటన్‌లో జరగనున్నాయి. 12 నెలల పాటు జరిగే ఈ ప్రయోగాలకు 6 వేల మంది వలంటీర్ల నియామకం ప్రారంభించారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.
కరోనా స్పైక్ ప్రోటీన్‌ను శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు హానికరం కాని కోల్డ్ వైరస్‌ను జాన్సెన్ టీకా ఉపయోగిస్తుంది. దీని ద్వారా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తొలుత బ్రిటన్‌లో ప్రారంభించి మరో ఆరు దేశాల్లో ట్రయల్స్‌ను నిర్వహించనున్నట్లు ఈ పరిశోధనకు సారథ్యం వహిస్తున్న డాక్టర్ సాల్ ఫాస్ట్ తెలిపారు. మొత్తం 30 వేల మందిని నియమించుకోనున్నట్లు చెప్పారు. సగం మంది వలంటీర్లకు ప్లాసిబో ఇవ్వనున్నట్లు తెలిపారు. వృద్ధులు, మతపరమైన మైనారిటీలను కూడా వలంటీర్లుగా నియమించాలని పరిశోధకులు భావిస్తున్నట్లు చెప్పారు.