అంతర్జాతీయంగా చైనా దూకుడుకు పగ్గాలేసే దిశగా బ్రిటన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. డ్రాగన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు మరిన్ని అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం సహా అంతరిక్ష, సైబర్‌స్పేస్ రంగాల్లో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని లక్ష్యించుకుంది. ఈ మేరకు బ్రిటన్ సైనిక, విదేశాంగ విధానాలపై సమీక్ష నిర్వహించిన బోరిస్ జాన్సన్ సర్కార్.. తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.
చైనాను యూకే ఆర్థిక వ్యవస్థకు ఉన్న అతిపెద్ద ప్రభుత్వపరమైన ముప్పుగా నివేదిక అభివర్ణించింది. రోజురోజుకు పెరుగుతున్న చైనా శక్తిసామర్థ్యాలు, దూకుడు విధానాలు.. భౌగోళిక రాజకీయ విషయాల్లో అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్న అంశాలని చెప్పుకొచ్చింది. మరోవైపు, రష్యాను బ్రిటన్ భద్రతకు పొంచి ఉన్న పెను సవాల్‌గా పేర్కొంది.
చైనాపై బోరిస్ మండిపాటు
ఈ నివేదిక విడుదలైన తర్వాత పార్లమెంట్ వేదికగా చైనాపై విరుచుకుపడ్డారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. షింజియాంగ్‌లోని ఉయ్గుర్ ప్రజలను సామూహికంగా నిర్బంధించడాన్ని ఖండించారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల వ్యక్తుల పట్ల వ్యవహరించే తీరును తప్పుబట్టారు.